అతి చేయబోయి.. పీకల్దాకా ఇరుక్కున్న వంశీ!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడడం కోసం తాను చేసిన దుర్మార్గంపై కేసు నమోదు అయినప్పుడు.. హాయిగా విచారణను ఎదుర్కొని.. తాను చేసింది తప్పు కాదని.. ఆ సమయానికి ఆగ్రహానికి గురికావడం వల్ల అలా జరిగిందని చెప్పుకుని ఉంటే చాలా సింపుల్ గా తేలిపోయి ఉండేది. కానీ.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా ఓవరాక్షన్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తి.. దాడి గురించి పోలీసు కేసు పెడితే.. ఏకంగా అతడిని కిడ్నాప్ చేశారు. నిర్బంధించి, హింసించారు. అతడితో న్యాయమూర్తి ఎదుట తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు. అలా అసలు దాడి కేసు నుంచి తప్పించుకోగలం అని అతితెలివి ఎత్తుగడ వేశారు. తీరా ఇప్పుడు ఏమైంది? కేవలం ఆ కిడ్నాప్ కారణంగా.. పీకల్దాకా కూరుకుపోయారు వంశీ. బెయిల్ కూడా గగనం అనిపించే దుస్థితిలో ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైకాపా నేత  మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆయన అనుచరులు సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసి దాడిచేసినట్టుగా పోలీసులు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.  తాము చెప్పినట్టు వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని కూడా అంతం చేస్తామని సత్యవర్ధన్ ను బెదిరించినట్టుగా ఆ చార్జిషీట్ లో పేర్కొన్నారు.
కంప్లయింటు చేసిన వ్యక్తిని లొంగదీసుకుంటే.. అసలు కేసే లేకుండా పోతుందనేది వంశీ చేసిన కుట్ర. ఒక రకంగా ఇది నిజమే కావొచ్చు. జగన్ పరిపాలన సాగుతున్న రోజుల్లో ఆయన ఈ పనిచేసిఉంటే అలాగే జరిగి ఉండొచ్చు. కానీ అప్పట్లో.. తమ మీద ఎన్ని ఫిర్యాదులు వస్తే మాత్రం.. ఏం జరగబోతుంది? అనే పొగరుతో వ్యవహరించారు. కేసు అప్పట్లోనే నమోదైనప్పటికీ.. దాని గురించి పోలీసులూ పట్టించుకోలేదు, వంశీ కూడా పట్టించుకోలేదు. తీరా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇలాంటి కుట్రకు వంశీ తెరతీయడం సాహసమే అని చెప్పాలి.

పలుచోట్ల నమోదు అయిన సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా.. పోలీసులు ఈ కేసును చాలా స్పష్టంగా ఛేదించారు. కిడ్నాప్ చేసిన దగ్గరినుంచి, సత్యవర్దన్ ను వంశీ అనుచరులు హైదరాబాదులోని వంశీ నివాసానికి తరలించడం అక్కడ నిర్బంధించడం, అక్కడినుంచి మరో కారులో విశాఖ తరలించడం ఇవన్నీ కూడా ససాక్ష్యంగా దొరికిపోయాయి. వల్లభనేని వంశీ పూర్తిగా ఈ కేసులో కూరుకుపోయారు.
గన్నవరం టీడీపీ ఆఫీసు కాదు కదా.. టీడీపీ మంగళగిరి సెంట్రల్ ఆఫీసు మీద జరిగిన దాడి కేసు కూడా ఇంకా సా..గుతూనే ఉంది. కానీ.. కేసును తప్పుదారి పట్టించాలని వంశీచేసిన ఓవరాక్షన్ ను  ఆయనను ఇక తప్పించుకోవడానికి వీల్లేకుండా ఇరికించేసిందని ప్రజలు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories