కుక్క తోక వంకర అన్నట్టుగానే ఉన్నది పాకిస్తాన్ బుద్ధి! తమ దేశ ప్రజలు అసహ్యించుకోకుండా ఉండడానికి, తమను చేతగాని వారిగా పరిగణించకుండా ఉండడానికి.. భారత్ మీద విరుచుకు పడడం తప్ప మరొక దారి లేదు అన్నట్లుగా.. పాకిస్తాన్ వంకర బుద్ధితో ఆలోచిస్తుంది. డ్రోన్ బాంబులను మెసేజ్ లను భారత్ మీదికి వరుసగా ప్రయోగిస్తూ ఉంది. యుద్ధ ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అయితే యుద్ధం చేయడంలో కూడా తమ ధైర్యాన్ని, సాహసాన్ని కాకుండా.. దుష్టబుద్ధిని, కుటిల పన్నాగాలను అనుసరిస్తుండడం ఇక్కడ గమనించాల్సిన సంగతి. యుద్ధం నేరుగా సైన్యంతో కాకుండా.. భారత్ లోని జనావాసాలను ధ్వంసం చేయడంలో విమానాశ్రయాలను టార్గెట్ చేసి పెను నష్టాన్ని కలిగించడంలో పాకిస్తాన్ దృష్టి పెడుతుండడం అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రమకు గురిచేస్తున్నది. పాకిస్తాన్ పట్ల ప్రపంచవ్యాప్తంగా అసహ్యం వెల్లువెత్తుతోంది.
తాజాగా 26 ప్రాంతాలలో పాకిస్థాన్ ప్రయత్నించిన డ్రోన్ దాడులను భారత్ తిప్పి కొట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. తుర్కియే దేశానికి చెందిన అక్కడ తయారైన డ్రోన్లతో పాకిస్తాన్ ఈ దాడులు నిర్వహించినట్లుగా సైన్యం గుర్తించింది. దుర్మార్గం ఏమిటంటే సైనిక కేంద్రాలతో పాటుగా విమానాశ్రయాలను దెబ్బతీయడానికి ఈ డ్రోన్ దాడులను లక్ష్యించినట్లుగా అర్థమవుతుంది. అయితే భారత సైన్యం ఈ దాడులను సమర్ధంగా తిప్పి కొట్టడంతో.. శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అవంతి పోరా ఎయిర్ బేస్ సురక్షితంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ జనావాసాలే లక్ష్యంగా మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులు చేస్తుండడం వలన పంజాబ్ కాశ్మీర్ లలోని అనేక నగరాలలో బ్లాక్ అవుట్ ప్రకటించారు. సరిహద్దు దాటి భారత్ లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చారు. సరిహద్దు గ్రామాల ప్రజలందరూ కూడా ఇళ్లలో మాత్రమే ఉండాలని బయటకు రావద్దని హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగించి భారత సైన్యం చేతిలో భంగపడడం గురువారం నాడే జరిగింది. భారత్ కు కీలకంగా ఎలాంటి నష్టమూ జరగకుండా అన్ని రకాల పాక్ ప్రయోగాలను సైన్యం గురువారమే తిప్పికొట్టింది. అప్పటికి బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ శుక్రవారం నాడు కూడా ఇదే తరహా కవ్వింపు దాడులకు పాల్పడింది. జమ్మూ సాంబా జిల్లాలలో ఫిరంగులతో దాడులను కొనసాగించింది. శ్రీనగర్ ప్రాంతంలో ప్రజలకు సూచనలు హెచ్చరికలు చేయడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను వినియోగించి సైన్యం అప్రమత్తం చేసింది. సరిహద్దు ప్రాంతాలు మొత్తం తరచుగా హెచ్చరిక సైరన్లు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎంత భయానక పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ భారత్ కు కించిత నష్టం కలుగకుండా సైన్యం అప్రమత్తంగా ఉంటూ కాపు కాస్తోంది. దాడులను సమర్ధంగా తిప్పి కొడుతోంది.
ఈ విఫల యత్నాలతో పాకిస్తాన్ మాత్రం అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడుతున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు.