వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అదివరలో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా పనిచేశారనే అనుమానంతో కొందరు అధికారులను దుర్మార్గంగా వేధించిన సంగతి అందరికీ తెలుసు. అలా ఆయన వేధింపులకు గురైన వారిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి వస్తే బాబు పాలనలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు గురించే చెప్పుకోవాలి. ఈ సీనియర్ ఐపీఎస్ అధికారిని జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. రకరకాల అక్రమ కేసులు బనాయించి మళ్లీ మళ్లీ సస్పెండ్ చేశారు. ఆయా ఉత్తర్వులను ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తప్పు పట్టినా కూడా ఖాతరు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరించారు. వేరే గతి లేని పరిస్థితుల్లో ఆయన రిటైర్ అయ్యే రోజున పోస్టింగ్ ఇచ్చి అవమానించి పంపారు.
ఒక అధికారిని టార్గెట్ చేస్తే ఎన్ని రకాలుగా వేధించవచ్చునో అన్ని రకాలుగానూ జగన్- ఏబి వెంకటేశ్వరరావు ని వేధించారు. అయితే ఏబీవీ మీద జగన్ చేసిన కుట్రలు నిష్ఫలం అయ్యాయి. భద్రత పరికరాలకు కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ జగన్ హయాంలో నమోదు చేసిన ఏసీబీ కేసును హైకోర్టు తాజాగా కొట్టేసింది. ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర పై ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. ఆ అభియోగాలు న్యాయ విచారణ ముందు నిలబడవని తెలిపింది. అస్పష్టమైన నిరాధార ఆరోపణలు చేశారని ఆక్షేపించింది.
ఈ తీర్పుతో జగన్మోహన్ రెడ్డి కుట్ర మొత్తం బట్టబయలు అయినట్లుగా కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీపై 2021లో కేసు నమోదు చేయగా.. 2022లో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
అప్పట్లో భద్రత పరికరాల కొనుగోలు విషయంలో కొనుగోలు కమిటీ, సాంకేతి కమిటీలను అప్పటి డిజిపి నే ఏర్పాటు చేశారని, డిజిపి కోరిన మేరకు సీనియర్ అధికారుల పేర్లను మాత్రమే ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు తప్ప ఆయా కమిటీలు నిర్ణయాలను ఆయన ప్రభావితం చేశారనడానికి ఆధారాలు లేవని ఆయన న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. పరికరాలు కొనుగోలుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం జరగనేలేదని తెలియజేశారు. అసలు ఖర్చే పెట్టనప్పుడు అనుచిత లబ్ధి పొందడం ఎలా జరుగుతుందని వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఏసీబీ నమోదు చేసిన కేసులు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.
కాగా.. ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు పోలీస్ హౌసింగ్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. గత ప్రభుత్వ కాలంలో జగన్ వల్ల ఇబ్బందులు పడిన వారికి న్యాయం జరిగేలా పోరాడుతానంటూ ఆయన ఇటీవల ప్రకటించారు. కోడికత్తి శీను, హత్యకు గురైన దళిత డ్రైవరు సుబ్రమణ్యం కుటుంబాలను ఆయన పరామర్శించారు. జగన్ బాధితులకు న్యాయం జరిగేలా చూడడానికి అవసరమైతే రాజకీయ పార్టీ కూడా స్థాపిస్తానంటూ.. ఏబీ వెంకటేశ్వరరావు కార్యచరణతో సాగుతున్న సమయంలో.. కోర్టు తీర్పు ఆయనకు పెద్ద ఉపశమనమే కలిగించింది.