వాలంటీర్లతో కుట్రలు ఫలించలేదని గుడివాడ దిగులు!

వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లను రకరకాల ప్రలోభాలకు గురిచేయవచ్చునని, వారిని భయపెట్టవచ్చునని అంతిమంగా.. తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడంలో వాలంటీర్లు తమ చెప్పుచేతల్లో ఉండే వ్యవస్థగా ఉపయోగపడతారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. దానికితోడు వారి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా.. అదే మాటలతో వారిని ఊదరగొట్టారు. వాలంటీర్లు ఉంటే చాలు.. మీరు గెలిచిపోతారు.. అన్నట్టుగా అభ్యర్థులకు హితోపదేశాలు చేశారు. కానీ  అనేక కారణాల వల్ల వాలంటీర్లకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేకపోవడం, వాలంటీర్లు అంటేనే వైసీపీ కార్యకర్తలు అన్నట్టుగా ముద్రపడిపోవడం వంటి అనేక విషయాల వల్ల వారికి ఓటమి తప్పలేదు. వాలంటీర్ల ద్వారా ఎన్నికల్లో ఎలాంటి కుట్రలు చేయాలనుకున్నామో.. అవన్నీ నెరవేరకపోవడం వల్లనే ఓడిపోయినట్లుగా ఇవాళ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒప్పుకుంటున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఓడిపోయిన నాటినుంచి ఇవాళ్టి దాకా పార్టీ వ్యవస్థలో మార్పు చేర్పులు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఆయన ఇటీవల అనకాపల్లి జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో గుడివాడ మాట్లాడుతూ.. వైకాపా కాలంలో వాలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ద్వారా ఎన్నో పథకాలు అమలు చేశాం అని అయినా ఎన్నికల్లో వాలంటీర్ల వల్లే ఓడిపోయాం అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుటాం అని చెప్పినా చాలా మంది ముందుకు రాలేదని అందువల్లనే ఓడిపోయామని అన్నారు. అంటే వాలంటీర్ల ద్వారా పథకాలు అమలు చేయించి, ఎన్నికల సమయంలో వారిద్వారా పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయించుకోవాలని వైసీపీ దూరాలోచన చేసినట్టు అర్థమవుతూనే ఉంది. వైసీపీ నాయకులందరూ వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి.. ఇంటింటికీ వెళ్లి.. జగన్ మళ్లీ గెలవకపోతే.. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయని చెప్పి ప్రజలను బ్లాక్ మెయిల్ చేయాల్సిందిగా పదేపదే ఊదరగొట్టారు.

ఈ కుట్రలకు ఎన్నికల సంఘం సకాలంలో అడ్డుకుంది. వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో నాయకుల వెంట ఏ ఒక్క వాలంటీరు కనిపించినా వారిని ఉద్యోగ విధులనుంచి తొలగించేలా కూడా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వాలంటీర్లకు భారీ తాయిలాలు అందించిన వైసీపీ నేతలు, వారిని రాజీనామా చేసి తమతో ప్రచారానికి రావాల్సిందిగా ఒత్తిడిచేశారు. చాలా చోట్ల ఆ ఒత్తిడులు ఫలించాయి. కొన్ని చోట్ల దొంగచాటు ప్రచారం చేస్తాం గానీ.. మీ వెంట రాం, రాజీనామా చేయం అంటూ వాలంటీర్లు అడ్డం తిరిగారు. అందుకోసం ఇప్పుడు గుడివాడ వారినే తప్పుపడుతున్నట్టుగా ఉంది. తమ చేతగానితనం, ప్రజా వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోతే.. ఇప్పుడు వాలంటీర్లను దోషులుగా చూడడం గుడివాడ అమర్నాధ్ దుర్బుద్ధికి నిదర్శనం అని పలువురు విమర్శిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories