అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ.. అమరావతి నగరం అత్యుత్తమ రాజధానిగా అభివృద్ధి చెందడానికి కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని అన్నారు. ఇప్పటికే అనేక విధాలుగా సహకారం అందిస్తున్నామని, చంద్రబాబునాయుడు కేంద్రం ఎదుటకు తెస్తున్న ప్రతి ప్రతిపాదనను ఆమోదిస్తున్నాం అని నరేంద్రమోడీ చెప్పారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి హృదయాల్లో ఏ మాట అయితే ప్రతిధ్వనిస్తున్నదో.. అచ్చంగా అదే మాట ప్రధాని నోట కూడా వెలువడింది.
ప్రధాని ఈ సభలో మాట్టాడుతూ ‘‘ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు.. నాకు కనబడుతున్నది ఒక్క నగరం మాత్రమే కాదు.. ఒక స్వప్నం సాకారం కాబోతున్నదనే భావన కలుగుతోంది’’ అని అన్నారు. అవును- ఈ నగరం అనేది తెలుగు ప్రజల స్వప్నం. అమరావతి స్వప్నం సాకారం కావాలని, చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నట్టుగా ప్రపంచం మొత్తం తలతిప్పి ఇటుచూసే అద్భుత నగరంగా ఆవిష్కృతం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆ కల తీరడానికి మోడీ చేతుల మీదుగా జరిగిన కార్యక్రమమే శ్రీకారం అని మురిసిపోతున్నారు. సరిగ్గా ప్రధాని కూడా అదే మాట పలకడం విశేషం.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. దాదాపు 60 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశాను. ఇవన్నీ కాంక్రీటు నిర్మాణాలు కాదు. ఏపీ పురోగతి ఆశలు, వికస్ భారత్ ఆశయాలకు బలమైన పునాదులు.. అంటూ మోడీ కితాబిచ్చారు.
ఇంద్రలోకం రాజధాని అమరావతి, ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభసంకేతం. ఆంధ్రప్రదేశ్ ను ఆధునిక ప్రదేశ్, ఆధునాతన ప్రదేశ్ గా మార్చే శక్తి అమరావతి. అమరావతి కేవలం ఒక నగరం కాదు.. యువత కలలు సాకారం అయ్యే రాజధానిగా ఈ నగరం ఎదుగుతుంది.
ఎన్టీఆర్ వికసిత్ ఏపీ కోసం కలలు కన్నారని, మనందరి కలిసి ఆయన కలల్ని నిజం చేయాలని వికసిత్ భారత్ కు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలని అంటూ ప్రధాని నరేంద్రమోడీ.. డిప్యూటీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ‘‘పవన్ కల్యాణ్ గారూ ఇది మనం చేయాలి.. మనమేచేయాలి’’ అంటూ తెలుగులో అనడం సభలో హర్షాతిరేకాలను నింపింది. మొత్తానికి మోడీ ఆశాజనకమైన మాటలతో.. అమరావతి రాజధాని విషయంలో తెలుగు ప్రజల స్వప్నం త్వరలోనే సాకారం కాబోతున్నదని అనిపిస్తోంది.