వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు, ఆలోచనలు, స్పందనలు ఎలా ఉంటాయో.. ఆ పార్టీకే చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల ఒక బహిరంగ సభ వేదిక మీదినుంచే వర్గీకరించిన సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వారు తమ వైసీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారని.. రాష్ట్రంలో తిరిగి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. వారి భరతం పడతామని కారుమూరి ఒక సభలో ఇటీవల హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలు ఆ పార్టీలో బొడ్డూడని ప్రతి నాయకుడూ చేస్తున్నాడు కదా అనుకోవచ్చు. కానీ కారుమూరి అంతటితో ఆగలేదు. గుంటూరుకు ఇవతల అంటే.. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు జిల్లా వరకు అన్నమాట.. తమ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం వారిని ఇళ్లలోంచి బయటకు ఈడ్చుకొచ్చి కొడతాం అని.. గుంటూరుకు అవతల అయితే తెలుగుదేశం వారిని ఎక్కడికక్క నరికి పారేస్తారు అని కారుమూరి హెచ్చరించారు. అంటే ఆ పార్టీలో గుంటూరుకు అవతల- ఇవతల అంటూ రెండు రకాల నాయకుల వర్గీకరణ ఉంటుందన్నమాట అని ప్రజలు అనుకున్నారు.
తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీ తరఫున 25 పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. వీరు అక్కడి రీజినల్ కోఆర్డినేటర్లతో కలిసి పనిచేయాలి. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పార్టీని బలోపేతం చేయాలి. అయితే ప్రత్యేకించి పైన చెప్పుకున్న వర్గీకరణ ప్రకారం.. గుంటూరుకు అవతల- ఆ స్థాయి పనిచేయగల వారుగా, జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా తన సామాజికవర్గానికి చెందిన నాయకుల్ని మాత్రమే ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తం 25 ఎంపీ నియోజకవర్గాలకు పరిశీలకులను ప్రకటిస్తే.. అందులో 12 మంది రెడ్డి కులానికి చెందిన వారే ఉండడం విశేషం.
వీరిలో ఇంకా ప్రత్యేకంగా గుంటూరుకు అవతల- అంటే ఒంగోలు, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో ఒక్కరు తప్ప అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపిక చేసుకున్నారు. ఒక్క రాజంపేటకు మాత్రం కొత్తమద్ది సురేష్ బాబును ఎంపిక చేశారు. తనకు బలం ఉంటుందని జగన్ భావిస్తున్న ప్రాంతంలో.. తన సామాజికవర్గం వారైతేనే విశ్వాసంతో పనిచేస్తారని జగన్ భావిస్తున్నారనడానికి ఇది ఉదాహరణ అని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
జగన్ అధికారంలో ఉన్నంత కాలం.. కాస్త విలువైన ప్రతి పదవిలోనూ అధికార యంత్రాంగంలో గానీ, నామినేటెడ్ పదవుల్లో గానీ అంతా రెడ్లనే నియమించారనే పేరుంది. పార్టీలో కూడా అలాగే జరుగుతూ వచ్చింది. ఇటీవలి పీఏసీ కమిటీ వేసినప్పుడు.. కొంచెం కులాల తూకం పాటించినట్టు కనిపించారు. తీరా ఇప్పుడు ఎంపీ నియోజకవర్గ పరిశీలకులు అనే సరికి మళ్లీ అంతా రెడ్లే కావాలని అనుకుంటున్నట్టుందని ప్రజలు భావిస్తున్నారు.