‘ఎన్ని బూతులు తిట్టినా టికెట్ ఇచ్చేది లేదు’

జగనన్న కళ్లలో ఆనందం చూడడం అనేది వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో మిగిలిన నాయకులందరికీ ఉండే ఒక కామన్ లక్ష్యం. అందుకోసమే వారు ఏమైనా మాట్లాడుతూ ఉంటారు.. చేస్తూ ఉంటారు. కానీ.. జగనన్న కళ్లలో ఆనందం కోసం ఎంతగా రెచ్చిపోయినా సరే.. అందరికీ వారి వారి కష్టానికి తగినంత ఫలితం లభిస్తుందని చెప్పడానికి మాత్రం వీల్లేదు. కొందరు ఎంతగా జగనన్నను ఇంప్రెస్ చేసే దూకుడును ప్రదర్శించినా.. వారికి ఎన్నటికీ ఏమీ దక్కకపోవచ్చు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ పరిస్థితి కూడా అలాగే అవుతుందని అదే పార్టీలోని పలువురు నాయకులు జోస్యం చెబుతున్నారు. జగనన్న కళ్లలో ఆనందం చూడడం కోసం తనకున్న బూతుల పాండిత్యాన్ని మొత్తం చాలా తరచుగా ప్రదర్శిస్తూ ఉండే గోరంట్ల మాధవ్.. ఎంత ఓవరాక్షన్ చేసినా సరే.. తాను ఆశించే ప్రయోజనాలు మాత్రం తిరిగి పొందలేడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గోరంట్ల మాధవ్ తాజాగా బెయిలుపై విడుదల అయ్యారు. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడిచేసినందుకు, ఆ సందర్భంగా పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేసినందుకు ఆయన అరెస్టు అయి  ఇన్నాళ్లు రాజమండ్రి జైల్లో గడిపారు. ఆయనతో పాటు, ఆయన అనుచరులకు కూడా బెయిలు రావడంతో అంతా బయటకు వచ్చారు. ప్రతి శనివారం వారు గుంటూరు నగరంపాలెం స్టేషనకు వచ్చి సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా గోరంట్ల తన దూకుడును విడవకపోవడం గమనార్హం.

రాజమండ్రి జైలు బయటే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యారాజకీయాలు, అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా సరే.. వైసీపీ నాయకుల, శ్రేణుల పిక్క మీద వెంట్రుక కూడా పీకలేరంటూ.. రెచ్చిపోయారు. ఇలాంటి దూకుడే ఆయనను గతంలో ఎంపీని చేసింది. ఇప్పుడు జైలు పాల్జేసింది. కాబట్టి ఇదే దూకుడును, బూతులను నమ్ముకుంటే మళ్లీ ఎంపీ కావొచ్చునని.. జగనన్న కళ్లలో ఎంతగా ఆనందం కనిపిస్తే అంతగా తాను మళ్లీ ఎంపీ అయ్యే అవకాశాలు పెరుగుతాయని ఆయన నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.
అందుకే కాబోలు.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. వైసీపీ ఓడేది లేదని, కూటమి మరోసారి గెలిచేది లేదని తన జోస్యం చెబుతున్నారు. ప్రతిరోజూ ఓ రాజకీయ హత్య జరుగుతోందని అంటున్నారు. గోరంట్ల మాధవ్ ను ఒకసారి ఎంపీ చేసినందుకే పార్టీ పరువు ఎంతగా మంటగలిపాడో జగన్ కు క్లారిటీ ఉంది. ఆయన ఇప్పుడు ఎంతగా పొగిడినా సరే.. మరోసారి ఎంపీ అవకాశం ఇస్తారని అనుకోవడం భ్రమ అనేది పార్టీ నాయకుల మాట. కేవలం చంద్రబాబును బూతులు తిట్టడం మాత్రమే అర్హత అయ్యేట్లయితే.. తమ పార్టీలో ప్రతి నియోజకవర్గానికి నలుగురైదుగురికి టికెట్లు ఇవ్వాలని.. గోరంట్ల మాధవ్ ఖాతాలో ఉండే చెడ్డపేరుకు.. ఆయన ప్రత్యర్థుల్ని ఎంత తిట్టినా.. ఇతర ప్రయోజనాలు దక్కాల్సిందే తప్ప.. మళ్లీ ఎంపీ కావడం జరగదని పలువురు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories