వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంమొత్తం ఎదుర్కొన్న చీకటి పాలన ఒక ఎత్తు. ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు అనుభవించిన వేదన, పడిన ఆందోళన మాత్రం ఒక ఎత్తు. అమరావతి రాజధాని ప్రాంతంలో అదివరకే తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన పనులన్నింటినీ సర్వనాశనం చేయడం మాత్రమే కాదు. మూడు రాజధానుల కాన్సెప్టు తెరపైకి తెచ్చి.. వారి బతుకుల్లో నిప్పులు పోశానని ఆనందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సంవత్సరాల తరబడి చేసిన దీక్షలతో పాటు, న్యాయపోరాటం ద్వారా.. అమరావతి ఒక్కటే రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి! ఆయన చీకటి పాలన అనేది.. అమరావతి రైతుల్లో ఎప్పటికీ బయటకు రాలేని భయాలను మిగిల్చింది. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఆ భయాలను పారద్రోలి, వారి కలలను నిజం చేయడమే తన తొలి బాధ్యతగా భావించి అడుగులు వేస్తుండడం విశేషం.
మే2 వతేదీన అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్న తరుణంలో.. రాజధానికి భూములిచ్చిన రైతులతో ఉండవిల్లిలోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆ సభకు రైతులందరూ తమ కుటుంబాలతో సహా హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు. ఈ సభలో భూములిచ్చిన సుమారు 30 మంది రైతులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా సత్కారం కూడా జరగబోతోంది. అయితే ఈ సమావేశంలో.. అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అని పార్లమెంటులో తీర్మానం చేయాలని రైతులు చంద్రబాబును కోరారు. కేంద్రంలో చంద్రబాబు కీలక భాగస్వామి గనుక.. ఆయన చెబితే మోడీ వింటారని కూడా రైతులు అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. ‘అది మన పరిధిలోని అంశం కాదు. మనం డిమాండ్ చేయకూడదు. సామరస్యంగా అన్నీ సాధించుకుందాం’ అంటూ రైతులకు నచ్చజెప్పారు. అదే సమయంలో.. విభజన చట్టంలో పదేళ్లపాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చునని ఉన్నదని, ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తయిపోయింది గనుక.. అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా నోటిఫై చేయడానికి ఇబ్బంది ఉండకపోవచ్చునని చంద్రబాబునాయుడు వారికి హామీ ఇచ్చారు.
మొత్తానికి చంద్రబాబు పూనికతో.. రైతుల్లో ఉన్న ఈ ఆందోళన కూడా సమసిపోయేలాగా.. చంద్రబాబు ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన తరువాత.. జరగబోయే పార్లమెంటు సమావేశాలలో.. అమరావతిని ఏకైక రాజధానిగా నోటిఫై చేసే బిల్లు కూడా పార్లమెంటు ఎదుటకు వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇలా జరిగితే.. భవిష్యత్తులో మళ్లీ జగన్ దళాలు ఎన్నడైనా కుట్రలు తలపెట్టినా సరే.. వారి పప్పులుడకవని పలువురు అంటున్నారు.