వైసీపీకి షాక్ : మూడుచోట్ల రెపరెపలాడిన కూటమి జెండా!

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతసేపూ ‘మా పార్టీ తరఫున ఎంతమంది కౌన్సిలర్లు గెలిచారు.. మా పార్టీ తరఫున ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు.. బలం మాకే ఎక్కువ ఉంది’ అంటూ వంద రకాల ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అంతేతప్ప ఒకనాడు తన పార్టీ తరఫున గెలిచిన వారిలో ఇంకా ఎంతమందిలో తన మీద నమ్మకం మిగిలి ఉంది.. అనే మౌలికమైన అంశాన్ని ఆయన విస్మరిస్తుంటారు. ‘గెలిచిన వాళ్ళందరూ నీ బలం కాదు.. నీతో కలిసి ఉన్న వాళ్ళు మాత్రమే నీ బలం కింద లెక్క’ అనే రాజకీయ మౌలిక సిద్ధాంతాన్ని ఆయన చదువుకోలేదు. తన అసమర్ధ నాయకత్వం చూసి ఎంతమంది తన జట్టులో నుంచి పక్కకు జారిపోయారు అనేది ఆయన ఎప్పటికీ గుర్తించరు. ఎవరి రాజకీయ భవిష్యత్తు వాళ్లు కీలకంగా భావించుకునే తరుణంలో.. తన వెంట నడిస్తే ,పరిస్థితి అగమ్య గౌచారం అవుతుందనే భయంతో పార్టీని విడిపోతున్న వారి లెక్కలు ఆయనకు కనిపించవు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మునిసిపాలిటీలు/ కార్పొరేషన్లు ఒక్కటొక్కటిగా కూటమి పార్టీల పరం అవుతున్నప్పుడు అర్థంపర్థం లేని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

తెలుగుదేశానికి బలం లేకపోయినప్పటికీ కూడా తప్పుడు పద్ధతుల్లో మునిసిపాలిటీని చేజిక్కించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసింది.. అనేది ఆయన ప్రధానంగా వినిపించే ఆరోపణ. తాజాగా విశాఖపట్నం, గుంటూరు నగర కార్పొరేషన్ లతోపాటు కుప్పం మునిసిపాలిటీ కూడా కూటమి పరం అయ్యాయి. వీటిని తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంది. విశాఖపట్నంలో తెలుగుదేశానికి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. కార్పొరేషన్ మేయర్గా కోవెలమూడి రవీంద్రబాబు గెలిచారు. అదే సమయంలో కుప్పం మున్సిపాలిటీలో తమకు బలం ఉన్నదని  భ్రమిస్తూ మురిసిపోతూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం షాక్ ఇచ్చింది. చివరి నిమిషంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో మునిసిపల్ చైర్మన్ గా సెల్వ రాజు ఎన్నికయ్యారు.
నిజానికి విశాఖపట్నం, గుంటూరు విషయంలో పెద్దగా సస్పెన్స్ ఏమీ లేదు. విశాఖపట్నంలో ఇటీవల కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ గా ఉన్నటువంటి హరి వెంకటకుమారి పదవి కోల్పోయారు. అదేవిధంగా గుంటూరు మేయర్ గా పని చేసిన వ్యక్తి కొన్నాళ్ల కిందట తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నంలో పీలా శ్రీనివాసరావు, గుంటూరులో కోవెల రవీంద్రబాబు నెగ్గడం ముందు నుంచి అందరూ ఊహించినదే. కానీ కుప్పం సంగతి అలా కాదు. ఎన్నికల సమయంలో గెలిచిన కొందరు కౌన్సిలర్లు ఇదివరకే తెలుగుదేశం లో చేరిపోయారు. అయితే బలనిరూపణకు చాలినంత సంఖ్యాబలం వారికి కనిపించలేదు. ఇక్కడ వైసిపి తరఫున నెగ్గిన చైర్మన్ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యం అయింది. చైర్మన్ ఎన్నిక కోసం ఓటింగ్ జరిగిన సమయానికి మరో నలుగురు కౌన్సిలర్లు కూడా జగన్ మీద నమ్మకం లేక ఆయన పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేక తెలుగుదేశం పార్టీలో చేరిపోవడంతో వారు విజయఢంకా మోగించడం సునాయాసం అయింది. ఆ రకంగా రాష్ట్రంలోని మూడు ముఖ్యమైన మునిసిపాలిటీ చైర్మన్/మేయర్ ఎన్నికలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం దక్కించుకున్నట్లుగా అయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories