‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య వలన ఎవరు బాగుపడ్డారో.. అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరిందో అందరికీ తెలుసు.. వాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారు’ ఈ వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు. వివేకా హత్యకేసులో ఏ2 నిందితుడిగా ఉంటూ ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్న సునీల్ యాదవ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులనుంచి, తన సహనిందితుల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నదని.. ఆయన బెయిలుపై బయటకు వచ్చిన నాటినుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. తనకు రక్షణ కల్పించాలని కడపజిల్లా ఎస్పీని వేడుకున్నారు కూడా. ఆయన తాజాగా ఒక చానెల్ తో మాట్లాడుతూ.. వివేకా హత్యకు సంబంధించి అనేక కీలక అంశాలను, పరిణామాలను వెల్లడించారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక నిందితుడు దస్తగిరి మాదిరిగా తాను కూడా అప్రూవర్ గా మారిపోయి కోర్టులో అన్ని నిజాలు చెప్పేస్తాననే ఆందోళన వైసీపీ పార్టీవారిలోను, సాక్షి మీడియాలోను, సహనిందితుల్లోనూ కనిపిస్తోందని సునీల్ యాదవ్ అంటున్నారు. ఈ కేసులో అసలు సంగతులన్నీ కోర్టులోనే వెల్లడిస్తానని అంటున్నారు.
సునీల్ యాదవ్ ఈ కేసులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడెల్లా.. వైఎస్ భాస్కర రెడ్డి తీవ్రంగా హెచ్చరించేవారట. ‘ఎందుకు రా అంత తొందర. మేం బెయిలుపై బయటకు వెళ్లాక నువ్వు పిటిషన్లు వేసుకో. మేము బెయిలు కోరిన ప్రతిసారీ నువ్వు ఎందుకు పిటిషన్ వేస్తున్నావు. ఏ2గా ఉన్న నీ బెయిలే కొట్టేస్తే మాకు ఎలా బెయిళ్లు వస్తాయి..’ అని దురుసుగా అనేవారుట. వివేకానందరెడ్డి ఉన్నంత కాలం నోరెత్తకుండా బతికిన వారంతా.. ఆయనను హత్యచేసిన తర్వాత.. కించపరిచేలా మాట్లాడుతున్నారని సునీల్ యాదవ్ చెప్పడం విశేషం.
అవినాష్ రెడ్డి పరిశుద్ధుడు.. వివేకానందరెడ్డిని ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర రెడ్డి కలిసి హత్య చేయించారే తప్ప.. అవినాష్ రెడ్డి ఏ పాపమూ ఎరగడు.. అని ప్రజలను నమ్మించే ప్రయత్నంగా.. ఇటీవల హత్య అనే సినిమా తయారైంది. అడుగడుగునా సునీత మీద అనుమానాలు పుట్టించేలా ఈ సినిమాను చాలా జాగ్రత్తగా క్రాఫ్ట్ చేశారు. ఆసినిమాలో సునీల్ యాదవ్ ను పరమ క్రూరుడిగాను, ఆయన తల్లిని అవమానకరంగానూ కూడా ప్రొజెక్టు చేశారు. జైలునుంచి బెయిలుపై బయటకు వచ్చిన సునీల్ యాదవ్ ఆ సినిమా వచ్చిన దగ్గరినుంచి దానిపై పోరాడుతున్నారు. జైల్లో ఉండగానే తన తల్లిని సినిమాలో చూపించిన తీరు గురించి భాస్కర రెడ్డిని అడిగితే.. ‘పిల్లోడు (వైఎస్ అవినాష్ రెడ్డి) కేసు నుంచి బయటపడాల కదా.. అందుకే అలా చేయాల్సి వచ్చింది’ అన్నారని సునీల్ యాదవ్ చెబుతున్నారు. మొత్తానికి వివేకాహత్యలో కీలక పాత్రధారిగా ఏ2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఇప్పుడు వైసీపీ నేతలకు కొరకరాని కొయ్యగా మారినట్టు కనిపిస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రను బయటపెట్టేలా ఆయన చాలా దూకుడుగా మాట్లాడుతున్నారు. మరి ఆయన కోర్టుదాకా వెళ్లి తాను చెబుతానంటున్న వాస్తవాలన్నీ అక్కడ న్యాయమూర్తికే నివేదించడం ఎప్పటికి జరుగుతుందో.. తదుపరి చర్యలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.