నిజానికి ఇది చాలా ఆశ్చర్యకర పరిణామం. ఎందుకంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం చిన్న చర్య తీసుకుంటే చాలు.. ఆవేశంగా స్పందిస్తూ.. మీడియా ముందుకు వచ్చి హెచ్చరించేవాళ్లలో విడదల రజని ముందు వరుసలోనే ఉంటారు. అయిదేళ్ల పాలన కాలంలో అహంకారంతో చెలరేగుతూ పాపాలు చేసిన వారిమీద కేసులు నమోదు చేస్తే చాలు.. ఈ మాజీ మంత్రి నిప్పులు కురిపిస్తూ ప్రకటనలు గుప్పిస్తారు. మా పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ‘‘మా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఇంతకింతా తిరిగి చెల్లిస్తాం.. బాకీ ఉంచుకోం.. వడ్డీతో సహా మీకు చెల్లిస్తాం..’’ అంటూ తీవ్ర స్వరంతో సవాళ్లు చేస్తుంటారు. అలాంటి విడదల రజని.. తనకు సంబంధించి ఏసీబీ పోలీసులు నమోదుచేసిన అవినీతి కేసులో.. తన సొంత మరిది విడదల గోపీని అరెస్టు చేస్తే ఇప్పటిదాకా నోరు మెదపకుండా మీడియా ముందుకు రాకుండా ఏమైపోయారు.. అనే సందేహం పలువురికి కలుగుతోంది.
తాను చిలకలూరి పేట ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. విడదల రజని నియోజకవర్గ పరిధిలో అడ్డగోలుగా దందాలు ప్రారంభించారు. ఆక్రమంలో.. స్టోన్ క్రషర్స్ యజమానులను పీఏ ద్వారా పిలిపించి.. తనకు అయిదు కోట్ల రూపాయల ముడుపులు ఇవ్వాలని లేకపోతే వ్యాపారం చేసుకోలేరని హెచ్చరించారు. వారు స్పందించకపోయేసరికి.. ఆ క్రషర్స్ మీద తనిఖీలు నిర్వహించి.. సీజ్ చేయాల్సిందిగా సంబంధిత అధికారి జాషువాకు లేఖ రాశారు. ఆయన స్పందించకపోయే సరికి అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించి.. ఎమ్మెల్యే లేఖ రాసినా కూడా పట్టించుకోరా? అంటూ సిఫారసు చేయించుకున్నారు.
ఎట్టకేలకు జాషువా.. తను ఉన్నతాధికార్లకు కూడా సమాచారం ఇవ్వకుండా.. పెద్దఎత్తున సిబ్బందితో వెళ్లి.. తనిఖీలు నిర్వహించారు. ఆతర్వాత క్రషర్స్ యజమానులతో బేరం పెట్టారు. ఎమ్మెల్యేతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలని.. లేకపోతే యాభైకోట్ల జరిమానా పడుతుందని హెచ్చరించారు. క్రషర్స్ యజమానులు వేరే గత్యంతరం లేక.. ఎమ్మెల్యే వద్దకు వెళ్లి.. రెండు కోట్ల రూపాయల ముడుపులు ఇవ్వడానికి డీల్ కుదుర్చుకున్నారు. ఆమె పురమాయించిన మేరకు పురుషోత్తమ పట్నంలోని ఆమె మరిది విడదల గోపీ చేతికి ఆ సొమ్ము చేర్చారు. అలాగే గోపీకోసం మరో పదిలక్షలు, అధికారి జాషువాకోసం మరో పదిలక్షలు కూడా సమర్పించుకున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ ముడుపుల బాగోతంపై కేసు నమోదు అయింది. కేసు నమోదైన తర్వాత కూడా విడదల రజని చాలా ప్రగల్భాలు పలికారు. వేధింపులు అన్నారు. తగిన ప్రతీకారం తీర్చుకుంటాం అన్నారు. ఈలోగా, అరెస్టు భయంతో వణికిపోతున్న ఆమె తనకు ముందస్తు బెయిలు కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు ఆమెలో అరెస్టు భయం కంటిన్యూ అవుతుండగానే.. అనూహ్యంగా అసలు రెండుకోట్ల సొమ్మును తన చేతికి అందుకున్న.. తాను కూడా పదిలక్షల ముడుపులు పుచ్చుకున్న విడదల గోపీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కీలక తరుణంలో విడదల రజని సైలెంట్ గా ఉండడం గమనార్హం. తాను బయటకు వచ్చి విమర్శలు ప్రారంభిస్తే.. తక్షణం తనను కూడా అరెస్టు చేసేస్తారేమోఅని ఆమె భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.