ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ప్రపంచం తలతిప్పి చూసే ప్రమాణాలతో అద్భుతంగా అమరావతిని నిర్మించే ప్రయత్నాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నగరానికి తగిన స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో.. ఐదువేల ఎకరాల విస్తీర్ణంలో సరికొత్త ఎయిర్ పోర్ట్ కూడా నిర్మించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం సంకల్పిస్తోంది. దీనితోపాటు 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించి.. దేశానికే అమరావతిని స్పోర్ట్స్ రాజధానిగా తీర్చిదిద్దాలని కూడా ప్రభుత్వం సకల్పిస్తోంది.
అయితే.. ఈ కొత్త ఎయిర్ పోర్టు ఆలోచన గురించి ప్రజల్లో విషపూరితమైన ఆలోచనలను నింపడానికి.. దీనికోసం జరుగుతున్న ప్రయత్నాల వల్ల.. అమరావతి ప్రాంతంలో భూములిచ్చిన రైతులకు నష్టం జరుగుతుందంటూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు ఒక రకమైన కుటిల ప్రచారం నిర్వహిస్తున్నాయి. అయితే.. భూములిచ్చిన రైతులకు లాభం జరగడం కోసమే.. ఇక్కడి భూములకు విలువ పెరగడం కోసమే, పెరిగిన విలువ స్థిరంగా ఉండడం కోసమే.. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఆలోచన చేస్తున్నట్టుగా మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు.
హైదరాబాదులో ఒక ఎయిర్ పోర్టు ఉన్నప్పటికీ చంద్రబాబునాయుడు రెండో ఎయిర్ పోర్టు నిర్మించారు. అది లేకుంటే.. ఇప్పుడు దిగుతున్న విమానాల్లో పదిశాతం కూడా హైదరాబాదు రాగలిగేవి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న వందేళ్లలో సాధించగల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రాంతానికి స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే.. స్మార్ట్ అభివృద్ధి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో విమాన రవాణా సదుపాయాలు బాగా అందుబాటులో ఉన్నప్పుడే అలా జరుగుతుంది. అందుకోసమే ఈ ప్రయత్నం అని ఆయన చెబుతున్నారు.
మంత్రి నారాయణ మాటలు రైతులను మెప్పించే విధంగానే సాగుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడున్న 54 వేల ఎకరాల అమావతి ప్రాంతంలో కేవలం ప్రభుత్వ కార్యాలయాలు, ఐకానిక్ భవనాలు గట్రా నిర్మాణం అయినందువలన.. ఆ ప్రాంతంలో రైతుల వాటాకు దక్కే స్థలాల విలువ ఒక స్థాయికి పెరుగుతుంది. ఆ స్థలాల విలువ మరింతగా పెరుగుతూనే ఉండాలంటే.. తమ భూములను రాజధాని కోసం ఇచ్చిన రైతులు మరింతగా లాభపడాలంటే.. నారనాయణ చెబుతున్నట్టుగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావడం చాలా ముఖ్యం. ఆ నేపథ్యంలో.. అమరావతి రైతులందరూ కూడా.. విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ అనే కొత్త ఆలోచనలకు సుముఖంగానే ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. నిరాటంకంగా కొత్త ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.