ఒక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. పాత ప్రభుత్వంలోని రాజకీయ పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలగుతూ.. తమను వేధించిన అధికార్లను లూప్ లైన్లో పెట్టడం అనేది చాలా సహజం. అధికార పార్టీలతో అడ్డగోలు సంబంధాలు మెయింటైన్ చేస్తూ.. వారి కళ్లలో ఆనందం చూడడం కోసం.. తమ విధ్యుక్త ధర్మాన్ని మరచి ప్రవర్తించేవారికి.. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తప్పవని ముందే తెలిసి ఉంటుంది. పైగా ఐపీఎస్ స్థాయి అధికారులంటే.. సివిల్ సర్వీసెస్ కొట్టిన వాళ్లంటే.. వాళ్లు ఎంతో మేధావులు అయి ఉంటారు. కానీ.. ఇప్పుడు పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటే.. అంతటి మేధావులు కూడా చాలా సిల్లి సిల్లీ తప్పులు చేస్తూ.. దొరికిపోతున్నారేమిటా అనిపిస్తోంది.
ప్రస్తుత పరిణామాల్లో.. వైఎస్ జగన్ కు మాస్టర్ బ్రెయిన్ లాగా పనిచేసిన.. పోలీసులను వాడుకోవడంలోనూ, చట్టాలను అడ్డగోలుగా దుర్వినియోగం చేయడంలోనూ సలహాదారులాగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ పీఎస్సార్ ఆంజనేయులు కటకటాల వెనుక ఉన్నారు.
ఆయనను మించిన స్థాయిలో జగన్ భక్తిని ప్రదర్శిస్తూ.. చంద్రబాబు సహా.. జగన్ కక్ష కట్టిన వారందరినీ వేధించడానికి అధినేత చేతిలో ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడిన మరో సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఆ పాపాలతో సంబంధం లేని చిల్లర కేసుల్లో ఇరుక్కుంటున్నారు.
గతంలో సీఐడీ చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్ మీద ప్రభుత్వం ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ నమోదు చేసింది. సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఇలాంటి చార్జెస్ నమోదు చేస్తారు. సునీల్ కుమార్ ఉద్యోగప్రస్థానంలో అలాంటివి బోలెడు ఉండడంతో పక్కగానే నమోదు చేశారు. సీఐడీ చీఫ్ గా, అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇలా నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చారు.
సాధారణంగా కిందిస్థాయి ప్రభుత్వోద్యోగి అయినా సరే.. సెలవు రోజుల్లో కూడా.. తన ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం చట్టరీత్యా నేరం. సీనియర్ ఐపీఎస్ అధికారికి ఈ సంగతి తెలియకుండా ఉంటుందని అనుకోవడం భ్రమ. అయితే సునీల్ కుమార్ మాత్రం.. పలుమార్లు అనుమతి లేని విదేశీ పర్యటనలు, ఒక దేశానికి అనుమతి తీసుకుని, మరో దేశానికి వెళ్లడం లాంటి తప్పులు చేశారు.
2022 లో జార్జియాకు అనుమతి తీసుకుని యూఏఈకి వెళ్లారు. మరోసారి అనుమతి లేకుండా స్వీడన్ వెళ్లారు. వెయిటింగ్ లో ఉన్నప్పుడు కూడా అనుమతి లేకుండా అమెరికా వెళ్లారు. 2019లో అమెరికా వెళ్తానంటూ యూకే వెళ్లారు. 2021లో ప్రభుత్వానికి సమాచారమే ఇవ్వకుండా యూఏఈ వెళ్లారు. ఇన్ని తప్పులూ ఇప్పుడు ప్రభుత్వం నమోదుచేసిన చార్జెస్ లో ఉన్నాయి.
ఇంత సీనియర్ అధికారులు.. దాస్తే దాగని విషయాల్లాంటి విదేశీ పర్యటనల విషయంలో ఇంత సిల్లీ పొరబాట్లు చేస్తూ ఎందుకు దొరికిపోతుంటారు.. అనేది ప్రజల సందేహం. పైగా సునీల్ కుమార్ మీద ఇతరత్రా అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు నమోదు అయినవి సర్వీసు నియమ ఉల్లంఘనల చార్జెస్ మాత్రమే. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ముందుకు వెళితే.. ఇదివరకు ఉన్న అవినీతి కేసులన్నీ కూడా తిరగతోడుతారని తెలుస్తోంది.