ఇన్ని పాపాల చిట్టా ఉండగా.. బెయిలు సాధ్యమేనా?

జగన్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్సార్ ఆంజనేయులు.. తనను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత.. వారితో చిత్రమైన, తాత్వికమైన మాటలు చెప్పారు. మీరు అరెస్టు చేస్తారని నాకు వారం రోజుల ముందే తెలుసు. ఒకసారి జైలు కూడా చూసి వద్దాం అనుకున్నాను అంటూ వైరాగ్య ధోరణి ప్రదర్శించారు. అందుకే నేను ముందస్తు బెయిలు కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు అని కూడా చెప్పారు. బెయిలు కోసం కోర్టుకు ముందే వెళ్లకపోవడానికి కారణం.. కేవలం ఆయన చెప్పినదేనా.. కానీ.. వైసీపీ పెద్దల కళ్లలో ఆనందం చూడడానికి తాను చేసిన పాపాలు.. అంత చిన్నవేం కాదని, వాటికి బెయిలు రావడం కూడా సాధ్యం కాదనే స్పృహ ఈ సీనియర్ ఐపీఎస్ అధికారికి ఉండడం వల్లేనేనా? అనే  చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పీఎస్సార్ ఆంజనేయులును ఒకరోజు విచారించి రిమాండుకు పంపిన సందర్భంగా.. పోలీసులు సమర్పించిన రిమాండు రిపోర్టును పరిశీలిస్తే ఎవరైనాసరే నిర్ఘాంతపోతారు. ఆయన పాపాల చిట్టాలో ఇన్నేసి ఘోరాలుండగా.. అసలు బెయిలు వస్తుందనే ఊహ కూడా రాదు కదా.. అనుకుంటారు! అందులో ఉన్న వివరాలన్నీ రెడ్ హ్యాండెడ్ గా ఆయన దొరికిపోయే వ్యవభహారాలు!
వివరాల్లోకి వెళితే..

1) కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలను సీఎంవోకు పిలిపించి మాట్లాడారు ఆంజనేయులు. ముంబాయి వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి తీసుకురావాలని పురమాయించారు. దీనికి సంబంధించి కాల్ డేటా రికార్డుల ద్వారా.. ముగ్గురూ ఒకే చోట- సీఎంఓలో- ఉన్నట్టుగా పోలీసులు ఆధారాలు సేకరిస్తే.. పీఎస్సార్ మాత్రం.. ఎన్నికల సందర్భంగా ఎన్నో విషయాలు చర్చించడానికి పిలిపించి ఉంటానని, అంతేతప్ప కాదంబరి జత్వానీ కేసు కోసం కాదని ఆ విషయం వారితో మాట్లాడలేదని అంటున్నారు.
2) ఆ పని పూర్తిచేసేవారకు విశాల్ గున్నీకి రావాల్సిన ప్రమోషన్ ఉత్తర్వులను కూడా తొక్కిపెడతానని బెదిరించారు.

3) కాదంబరి ఎవరో తెలియదని, ఈ మధ్యనే వార్తల్లో చూశానని, సదభిప్రాయం కలగలేదని.. సన్నాయి నొక్కులు నొక్కిన పీఎస్సార్ ఆంజనేయులు.. అరెస్టుకోసం ముంబాయికి వెళ్లిన విశాల్ గున్నితో పలుమార్లు మాట్లాడినట్టుగా సాక్ష్యాలు ఉన్నాయి. విశాల్ గున్ని అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాతాతో కూడా మాట్లాడినట్టు ఆధారాలున్నాయి.
4) జత్వానీ, ఆమె తల్లిదండ్రులను కూడా అరెస్టు చేయడానికి కొన్ని రోజుల ముందే ఆంజనేయులు.. ముంబాయి పోలీసులతో మాట్లాడినట్టు కూడా సీఐడీ పోలీసులు ఆధారాలు సేకరించారు.
5) కాదంబరిని కేసులో పూర్తిగా ఇరికించడానికి ఆంజనేయులు ఒంగోలులోని ఒక న్యాయవాదితో పలుమార్లు మాట్లాడారు. అదే న్యాయవాదితో ఫోర్జరీ పత్రాలు తయారుచేయించినట్టుగా ఆధారాలు సేకరించారు.
6) కాదంబరి జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్ కేసు పెట్టడానికి ముందే.. పోలీసు అధికారులు ముంబాయి వెళ్లడానికి టికెట్లు బుక్ చేసేశారు.

7) కాదంబరి మరియు ఆమె తల్లిదండ్రులను కొండల మధ్యనున్న నిర్మానుష్య ప్రదేశంలో కొన్ని రోజుల పాటు నిర్బంధించి వేధించినట్టు, బెదిరించినట్టు కూడా పోలీసులు ఆధారాలు సేకరించారు.
ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దల ప్రాపకం కోసం తన కింది స్థాయి ఐపీఎస్ అధికార్లతో సహా పలువురు పోలీసులను కీలుబొమ్మల్లా ఆడిస్తూ.. వారితో తాను చెప్పినట్టుగా పనిచేయించి.. దుర్మార్గాలకు పాల్పడినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాదంబరి జత్వానీతో ముంబాయిలోని పారిశ్రామికవేత్తపై కేసు విత్ డ్రా చేయించడానికి ఇన్ని వ్యవహారాలు నడిపిన ఆంజనేయులుకు బెయిలు ఇస్తే ఆయన.. బయటికొస్తే.. సాక్ష్యాలు మొత్తం తారుమారు చేయగల సత్తా కలిగి ఉన్నవారని.. బెయిలు ఇవ్వరాదని సీఐడీ పోలీసులు కోర్టుకు నివేదించారు. అయితే.. అసలు ఆయన  పాపాల చిట్టాలో ఇన్ని  ఘోరాలు చూసిన తర్వాత.. బెయిలు రావడం సాధ్యమేనా అని ప్రజలు విస్తుపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories