పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినీప్రస్థానానికి భరతవాక్యం పలకనున్నారా? ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తిచేసేసిన తర్వాత.. కొత్త సినిమాలు ఒప్పుకునే ఉద్దేశం పవన్ కులేదా? ఒకవైపు రాజకీయ జీవితంలో తొలిసారి విజయం సాధించిన సందర్భంలోనే ఉపముఖ్యమంత్రిగా ప్రాధాన్యం గల కీలకపోస్టును దక్కించుకున్న పవన్ కల్యాణ్ నిత్యం చాలా బిజీగా గడుపుతున్నారు. ఆ నేపథ్యంలో ఒప్పుకున్న సినిమాలకు కాస్త సమయం కేటాయించి, వాటిని సకాలంలో పూర్తిచేయడానికి ఆయన వీలు కుదరడం లేదు.
భారీ సినిమాలు అనుకున్న దానికంటె ఆలస్యం అవుతున్న కొద్దీ.. నిర్మాత పరిస్థితి దుర్భరంగా మారిపోతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో తనను నమ్ముకున్న వాళ్లెవ్వరూ నష్టపోకుండా ఉండేందుకు ప్రస్తుతానికి లైనప్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసేస్తారని.. రాజకీయంగా బిజీ కారణంగా ఇక కొత్త సినిమాలు ఒప్పుకోరని విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఎఎం రత్నం నిర్మాతగా చేస్తున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. దీనితో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజీ, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను పవన్ ఇప్పటికే కమిటయ్యారు. ఈ మూడు చిత్రాల నిర్మాతలు ఎఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులతో పవన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సినిమాలను వీలైనంత త్వరితగతిన పూర్తిచేస్తానని వారికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ సినిమాలు షూటింగ్ బాగా ఆలస్యం అవుతున్నాయి. అప్పటికీ ఆయన ఎక్కడా లొకేషన్లకు గానీ, సెట్లకు గానీ రావాల్సిన అవసరం లేకుండా.. మంగళగిరిలో వారి పార్టీ ఆఫీసుకు సమీపంలోనే భారీ సెట్ నిర్మించారు. ఆయనకు కుదిరినప్పుడు అక్కడకు వచ్చి కొంతసేపు షూటింగ్ చేస్తే సరిపోతుంది. కానీ దానికి కూడా ఆయనకు వీలు చిక్కడం లేదు. పైగా ఇటీవలి కాలంలో వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ముందు హరిహరవీరమల్లు పూర్తిచేసి వచ్చే జులై కెల్లా విడుదలకు సిద్ధం చేయాలని అనుకుంటున్నారు.
ఆ తర్వాత ఓజీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే అన్నింటికంటె పెద్ద ట్విస్టు ఏంటంటే.. ఈ మూడు సినిమాల నిర్మాతలతో సమావేశం అయిన పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ బహుశా తన చివరి చిత్రం అవుతుందని సంకేతాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాను రాను చాలా బిజీగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదని.. రెండింటికీ న్యాయం చేయలేని పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.