ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏకంగా 3200 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టుగా లెక్కతేలుతున్న మద్యం కుంభకోణం యొక్క స్వరూపస్వభావాలు మొత్తం మారిపోయాయి. నిన్నటిదాకా ఉన్న అక్యూజ్డ్ జాబితా మొత్తం మారిపోయింది. తొలినుంచి ఏ1 నిందితుడుగా ఉన్న కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. ఏకంగా 29 మంది పేర్లతో ‘జంబో అక్యూజ్డ్ జాబితా’ ఏర్పడిన తర్వాత కూడా అదే హోదాను కాపాడుకుంటున్నారు. ఆయనను పోలీసులు అరెస్టు చేసి.. విచారించి, ఆయన ద్వారా అనేక కొత్త వివరాలు సేకరించిన తర్వాత.. 29 పేర్లతో జాబితాను రూపొందించారు. నిందితుల జాబితాలో లేకపోయినప్పటికీ.. ఇటీవల విచారణకు హాజరైన ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఇటీవల సాక్షిగా విచారణకు వచ్చి కెసిరెడ్డిదే ప్రధాన పాత్ర అని వాంగ్మూలం ఇచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు నిందితుల జాబితాలోకి ఏ4, ఏ5గా ఎంట్రీ ఇచ్చారు.
అయితే ప్రజలకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. అంతా జగన్ చెప్పినట్టే చేశానని కసిరెడ్డి చెప్పినప్పటికీ జగన్ పేరు మాత్రం నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదు.. అనేది!
రాజ్ కెసిరెడ్డి జగన్ పేరును చెప్పినట్టుగాను, ఆయనకు అందేలా ముడుపులు ఎలా చేరవేశారనే విషయాన్ని ధ్రువీకరించినట్టుగానూ సిట్ పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఈ వాంగ్మూలంపై సంతకం చేయడానికి కెసిరెడ్డి నిరాకరించినట్టుగా అందులో పేర్కొన్నారు. కేవలం ఆయన సంతకం చేయకపోవడం వల్లనే అక్యూజ్డ్ లిస్టులోకి జగన్ పేరు రాలేదని పలువురు భావిస్తున్నారు.
కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే కాదు. ఆయన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఆయన పేషీలోని ఐఎఎస్ ధనుంజయ రెడ్డి ల పేర్లు కూడా ఈ జాబితాలో లేవు. అన్ని కంపెనీల నుంచి, హ్యాండ్లర్ల నుంచి పోగుచేసిన డబ్బు మొత్తాన్ని ప్రతినెలా 50-60 కోట్ల రూపాయల వరకు తాను ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి అందజేసేవాడినని కెసిరెడ్డి చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్టులో ఉంది. కానీ ఆయన పేరు కూడా అక్యూజ్డ్ లో లేదు.
సమీకరించిన డబ్బులను బంగారం రూపంలోను, రియల్ ఎస్టేట్ కంపెనీల్లోను పెట్టుబడులుగా పెట్టారని విచారణలో తేల్చారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు, బంగారం దుకాణాలన్నీ అక్యూజ్డ్ జాబితాలోకి చేరాయి. సిట్ పోలీసులు జగన్ విషయంలో ఇంకా ఆచితూచి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అక్యూజ్డ్ జాబితా మారినందున వారందరినీ విచారించిన తరువాత.. దొరికే ఆధారాలను బట్టి తర్వాత పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది.