ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణంగా హత్యకు గురయ్యారు. సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో ఆయన తన కార్యాలయంలో కూర్చుని ఉండగా.. మొహాలకు రుమాళ్లు కట్టుకున్న నలుగురు వ్యక్తులు టూవీలర్స్ పై వచ్చి.. ఆయనను విచక్షణా రహితంగా కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించేసరికే ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు. మద్యం సిండికేట్ వ్యాపారిగా పేరున్న ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య.. ఒంగోలు ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో విషాదం నింపింది.
మరణించిన వీరయ్య చౌదరి తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబుకు మేనల్లుడు. ఈ హత్య వార్త వినగానే ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆస్పత్రిలో చేరారు. వీరయ్య చౌదరి భార్య ఇప్పటికీ చౌటపాలెం ఎంపీటీసీగా ఉన్నారు. ఈ హత్య పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాలోని తెలుగుదేశం నాయకులతో మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటాం అని ప్రకటించారు. లోకేష్ కూడా పాదయాత్రలో తనతో కలిసి నడిచిన వీరయ్య చౌదరితో అనుబంధం గుర్తుచేసుకున్నారు. ఈ హత్యతో షాక్ కు గురయ్యానని అన్నారు.
సరిగ్గా ఇక్కడే రాష్ట్రవ్యాప్తంగా కొత్త చర్చ మొదలవుతోంది. తెలుగుదేశానికి చెందిన కీలక నాయకుడు అత్యంత దారుణంగా హత్యకు గురైతే.. ఇప్పటిదాకా పార్టీలో ఏ ఒక్కరు కూడా.. ఈ హత్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయించారని, హత్య వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చవకబారు విమర్శలు చేయలేదు. మద్యం సిండికేట్ వ్యాపారి అయిన వీరయ్య చౌదరికి, లిక్కరుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న శత్రువులే ఈ పని చేయించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తెలుగుదేశం నాయకులు కూడా విచారణలో వాస్తవాలు తేలేవరకు రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు మాట్లాడడం, వక్రమైన నిందలు వేయడం సరికాదు అనే ఉద్దేశంతోనే వేచిచూస్తున్నారు. హత్యచేసిన వారిని పోలీసులు త్వరగా పట్టుకోవాలని మాత్రం కోరుకుంటున్నారు.
ఇదే సీన్- ఒక వైసీపీ కార్యకర్త/ నాయకుడి విషయంలో జరిగితే పరిణామాలు ఎలా ఉండేవో ఊహించుకుంటే జుగుప్స పుడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రతి వైసీపీ నాయకుడూ ప్రెస్ మీట్లు పెట్టేసి.. పోలీసుల అండ చూసుకుని.. తెలుగుదేశం నాయకులు తమ పార్టీవారిని హత్య చేసేస్తున్నారని అడ్డగోలు ఆరోపణలు చేసేవారు. మొగుడూ పెళ్లాల గొడవలు జరిగినా సరే.. ఏదో ఒకరకంగా వాటిని తెలుగుదేశానికి పులిమి నిందలు వేయడం జగన్ అలవాటుగా మార్చుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వ్యక్తిగత కక్షల పర్యవసానంగా వైసీపీ నేతలు హత్యకు గురైన కొన్ని సందర్భాల్లో వాటిని రాజకీయ హత్యలుగా ప్రొజెక్టు చేయడానికి జగన్ చాలా ప్రయత్నించారు. అడ్డగోలుగా నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారు. అందుకే ప్రజలు జగన్ కు హితవు చెబుతున్నారు. హత్యలు జరిగినప్పుడు అబద్దపు నిందారోపణలు చేయకుండా, హుందాగా వాస్తవాలకు కట్టుబడి ఉండడం ఎలాగో, నైతికవిలువలు పాటించడం ఎలాగో చంద్రబాబు, లోకేష్ లను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయ దురాలోచనలు మానుకోవాలని అంటున్నారు.