కసిరెడ్డి వెల్లడి : అంతా జగనన్న చెప్పిన మేరకే!

దాదాపు మూడువేల కోట్లరూపాయలకు పైగా అవినీతి జరిగినట్టుగా ప్రత్యేక దర్యాప్తు బృందం లెక్కతేల్చిన మద్యం కుంభకోణంలో.. అసలు బిగ్ బాస్ ఎవరో మొదటిసారిగా బహిరంగంగా వినిపించింది. ఈ కుంభకోణానికి కర్త కర్మ క్రియగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని.. సాక్షి అయిన విజయసాయిరెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ కసిరెడ్డి పోలీసులకు చిక్కిన తర్వాత విచారణలో జగన్ పేరు కూడా బయటపెట్టినట్టుగా.. తేల్చింది. లిక్కర్ కుంభకోణం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగినట్టుగా ఆయన వెల్లడించారు. పాలసీ తయారీ దగ్గరినుంచి ఎవరెవరి చేతికి ముడుపులు అందాలనే అంచెల వారీ వసూళ్ల విధానం సమస్తం ఆయన డిసైడ్ చేసినట్టే జరిగినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఫండ్ కోసం  భారీగా డబ్బు అవసరం అని.. ఆ ముసుగులో జగన్ ఈ దందాను ప్రోత్సహించినట్టుగా వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరో కూడా తేలిపోయింది. ఇక జగన్ అరెస్టు ఎప్పుడు అనేదే తరువాయి అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సిట్ పోలీసులు, ఆయన చెప్పిన విస్తుగొలిపే వివరాలతో పాటు, ఇదివరకే సేకరించిన వివరాలు అన్నీ కలిపి రిమాండ్ రిపోర్టు తయారుచేశారు. ఈ కుంభకోణం వెనుక వైఎస్ జగన్ పాత్ర చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతినెలా 50-60 కోట్లరూపాయలు వసూలు చేసి.. ఆ మొత్తాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేషీలో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డికి, ఎంపీ విజయసాయిరెడ్డి, బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేసేవారు.

మద్యం పాలసీ రూపకల్పన దగ్గరినుంచి.. వసూళ్లను పంచుకోవడం వరకు జరిగిన ఈ అతిపెద్ద కుంభకోణానికి రాజ్ కసిరెడ్డి కీలకకేంద్రబిందువుగా వ్యవహరించగా.. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, బాలాజీ అందరూ  ఇందులో పాత్రధారులు అని తేల్చారు.
కొత్త పాలసీ రూపొందించే బాధ్యతను సీఎం జగన్ స్వయంగా తనకు అప్పగించారని, ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు.. పార్టీ ఫండ్ కోసం భారీగా నిధులు సేకరించగలిగేలా ఈ పాలసీ తయారు కావాలని జగన్ సూచించినట్లు ఆయన చెప్పారు.

ఈ కుంభకోణానికి సహకరించడం కోసం సత్యప్రసాద్ అనే ఎక్సయిజ్ అధికారిని కన్ఫర్డ్ ఐఏఎస్ చేస్తామంటూ ఎర వేశారు. అలాగే వసూళ్ల నిర్వహణకు రాజ్ కసిరెడ్డి తన సొంత నెట్ వర్క్ ఏర్పాటుచేసుకున్నారు. ఏయే కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వాలి.. ఎవరు ముడుపులు ఇవ్వడానికి ఓకే చెప్పారు.. ఎంతెంత ముడుపులు వసూలు చేయాలి..  ఇవన్నీ రాజ్ కసిరెడ్డి నిర్ణయించారు. ముడుపులుగా తీసుకున్న నల్లధనాన్ని ప్రణాళిక ప్రకారం వైట్ గా మార్చే ప్రయత్నాలు జరిగేవి. బంగారం కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్, షెల్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మళ్లించారు. ముంబాయి ఢిల్లీలోని అతిపెద్ద హవాలా నెట్ వర్క్ ద్వారా డబ్బు పంపిణీ జరిగేది. ఈ మొత్తం దందా అంతా జగన్మోహన్ రెడ్డి సూచన మేరకే పురుడు పోసుకుని, ఆయన కనుసన్నల్లోనే దాదాపు అయిదేళ్లపాటు నిరాటంకంగా జరిగినట్టుగా తేలుతోంది. మరి సిట్ ఎలాంటి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుందోచూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories