డిఫెన్స్ మోడ్ : విజయసాయి ఆత్మరక్షణ పాట్లు!

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు డిఫెన్స్ మోడ్ లో మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లూ పరారీలో ఉన్న రాజ్ కెసిరెడ్డి కూడా సిట్ పోలీసులకు దొరికిన తర్వాత లిక్కర్ కుంభకోణం కేసు విచారణ ఎక్కడ తనమీదకు మళ్లుతుందో అనే భయం విజయసాయిరెడ్డిలో మొదలైనదేమో అనే అనుమానం ఆయన మాటలను గమనించిన వారికి కలుగుతోంది. వైసీపీ హయాంలో దాదాపు మూడువేల కోట్ల రూపాయలకు పైగా సర్కారులోని పెద్దలు కాజేయడానికి కారణమైన కొత్త లిక్కర్ పాలసీ.. విజయసాయి ఇంట్లోనే పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే.

ఆయన తాజా ట్వీట్లు మాత్రం ఆయన ఆత్మరక్షణ కోసం పాట్లు పడుతున్నారని సూచిస్తున్నాయి.
విజయసాయి తన తాజా ట్వీట్ లో ఏం చెబుతున్నారంటే.. ‘‘ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయీ నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’’ అని అంటున్నారు.

కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ని పోలీసులు విచారిస్తున్న రోజునే విజయసాయి తన ఎక్స్ ఖాతాలో ఈ ట్వీటు చేయడం ఆసక్తికరం. కొన్ని రోజుల కిందట సిట్ విచారణకు  సాక్షిగా హాజరైన విజయసాయి.. పాపం మొత్తం రాజ్ కెసిరెడ్డిదే అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. సిట్ పోలీసులతో చెప్పిన సంగతులనే  ఆయన వెలుపలికి వచ్చిన తర్వాత మీడియాకు కూడా చెప్పారు. కర్త కర్మ క్రియ అన్నీ కెసిరెడ్డి అనే అన్నారు. దానికి స్పందనగా.. తాను కూడా మీడియా ముందుకు వచ్చినప్పుడు.. విజయసాయి చరిత్ర మొత్తం బయటపెడతానని కెసిరెడ్డి సవాలు విసిరారు. ఇప్పుడు సిట్ పోలీసుల ఎదుట రాజ్ కెసిరెడ్డి విచారణలో తన పేరును ప్రధానంగా చెబుతాడేమో, డబ్బు స్వాహా పర్వానికి ముడిపెడతాడేమో అనే  భయం విజయసాయికి ఉన్నట్టుంది.

నిజానికి ఆయన విచారణకు హాజరైనప్పుడు.. కెసిరెడ్డిని ఇరికించేసి కొందరిని కాపాడే ఎజెండాతో మాట్లాడినట్టుగా కొందరికి అనుమానాలు కలిగాయి. తన ఇంట్లో జరిగిన పాలసీ మేకింగ్ సమావేశానికి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఎఎస్ ధనంజయరెడ్డి లాంటి వారు వచ్చారో లేదో తనకు గుర్తు లేదని చెప్పడం కొందరికి కామెడీగా ధ్వనించింది.  
‘ఏపీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్’ అని విజయసాయి తనకు తానుగా చెప్పుకోవడమే తమాషా. తనకు వాంగ్మూలం అవకాశం వచ్చినప్పుడు కొందరిని పూర్తిగా ఇరికించడానికి, కొందరిని కాపాడడానికి ప్రయత్నించడం ద్వారా.. విజయసాయి తనకున్న వ్యక్తిగత కక్షలను ఈ కేసును అడ్డు పెట్టుకుని తీర్చుకోవాలనుకుంటున్నారని అనిపించింది. ఇప్పుడు తాను టార్గెట్ చేసిన రాజ్ కెసిరెడ్డి పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చే దశ వచ్చిన తర్వాత.. ఆయన  హఠాత్తుగా డిఫెన్స్ మోడ్ లోకి మారి ట్వీట్లు పెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories