ఇంటిలిజెన్స్ చీఫ్ గా జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు లో ఇప్పుడు ఏపీ సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. కాదంబరి జత్వానిపై తప్పుడు కేసు బనాయించి, పోలీసులను అనుచితమైన మార్గాలలో పరుగులు పెట్టించి, ఆమెను అరెస్టు చేయించి వేధించినందుకు ఆంజనేయులు ఇప్పుడు అరెస్టు అయ్యారు. అయితే ఇలా అధికార యంత్రాంగాన్ని మొత్తం తప్పుదారి పట్టించి వాడుకోవడానికి ఆయనను పురమాయించింది ఎవరు? ఎవరి కళ్ళలో ఆనందం చూడడం కోసం ఆయన ఇలా తప్పు మీద తప్పు చేస్తూ వెళ్లారు.. అనేది తెలుసుకోవడానికి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణలో మరో కీలక ట్విస్టు చోటు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ముంబాయికి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకు ఫేవర్ చేయడం ద్వారా, తన స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో స్కెచ్ వేశారు. ఆ వ్యూహాన్ని అమల్లో పెట్టే బాధ్యతను ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులుకు అప్పగించారు. ఆయన విశాల్ గున్నీ, కాంతిరాణా తాతాలను సీఎంఓకు పిలిపించుకుని వారికి అప్పగించారు. కమిషనర్ ఆఫీసు నుంచే ముంబాయికి ఫ్లైటు టికెట్లు కూడా బుక్ చేశారు. కుక్కల విద్యాసాగర్ తో ముంబాయి నటి మీద ఫోర్జరీ కేసు పెట్టించారు. ఆమె కుటుంబాన్ని మొత్తం అరెస్టు చేసి తీసుకువచ్చి రిమాండులో ఉంచి వేధించారు.
ముంబాయి పారిశ్రామికవేత్తపై అక్కడ పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాల్సిందిగా వారు బెదిరించారు. వారి వేధింపులు భరించిన కాదంబరి జెత్వానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ మొత్తం ఎపిసోడ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కేసు విచారణ సాగుతోంది. కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, ఆంజనేయులు ముగ్గురినీ సస్పెండ్ చేశారు. తొలి ఇద్దరినీ విచారించడంలో ఆంజనేయులు పాత్ర గురించి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆయనను అరెస్టుచేసి విచారిస్తున్నారు.
విచారణలో నిజాలు చెబితే మీకే మంచిది అని సీఐడీ పోలీసులు ఆంజనేయులుకు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా.. కాదంబరి జెత్వానీని వేధించడం కోసం ఆ రేంజిలో అధికార దుర్వినియోగం చేయడానికి ఆంజనేయులును పురమాయించిన సీఎంఓ పెద్దలు ఎవరు? అనే విషయం మీదనే సీఐడీ పోలీసులు కాన్సంట్రేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కాదంబరి జెత్వానీ కేసుతో పాటు.. లిక్కర్ స్కామ్ లో నిందితులకు సహకరించేందుకు ఆయన ఏమైనా ప్రయత్నించారా.. అనే దిశగా కూడా పోలీసులు సమాచారం తెలుసుకోనున్నట్టు తెలుస్తోంది.