యాంకర్ రష్మీకి ఇటీవల జరిగిన శస్త్ర చికిత్స గురించి తెలిసిందే. తనకు ఏం జరిగింది ?, ప్రస్తుత తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా రష్మీ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేసింది. ‘ఇలాంటి క్లిష్ట సమయంలో నాకెంతో అండగా నిలిచిన వారందరికీ చాలా థ్యాంక్స్. సుమారు ఐదు రోజుల్లోనే నా శరీరంలో హెమోగ్లోబిన్ శాతం తొమ్మిదికి పడిపోయింది. జనవరి నుంచి నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అకాల రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో ఇబ్బందిపడ్డాను. వైద్యులను సంప్రదిస్తే ముందు దేనికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలో కూడా తెలియలేదు’ అని రష్మీ తెలిపింది.
రష్మీ ఇంకా మాట్లాడుతూ.. ‘మార్చి 29 నాటికి పూర్తిగా నీరసించిపోయాను. వర్క్ పరమైన కమిట్‌మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆస్పత్రిలో చేరాను. ఏప్రిల్ 18న సర్జరీ జరిగింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మరో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నాను’’ అని రష్మీ రాసుకొచ్చింది. సర్జరీకి ముందు దిగిన ఫొటోలను కూడా రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.