కసిరెడ్డి అరెస్టు : దొంగపేరుతో వచ్చినా దొరికిపోయాడు!

జగన్మోహన్ రెడ్డి హయాంలో మూడువేల కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడిన  మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు, నోటీసులు స్వీకరించకుండా.. విచారణకు హాజరు కాకుండా పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.   దుబాయి నుంచి హైదరాబాదుకు వచ్చిన రాజ్ కేసిరెడ్డిని విజయవాడనుంచి వచ్చిన సిట్ పోలీసులు ప్రత్యేక బృందం కాపుకాచి పట్టుకుని అదుపులోకి తీసుకుంది. రాజేష్ రెడ్డి అనే మారు పేరుతో దుబాయి నుంచి రాజ్ కసిరెడ్డి వస్తున్నట్టుగా పోలీసులు ముందే సమాచారం సేకరించారు. దాని ఆధారంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్దనే అరెస్టు చేసి, విజయవాడకు తరలిస్తున్నారు.

మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటలలోగా విజయవాడలోని సిట్ కార్యాలయం ఎదుట విచారణకు హాజరు కాబోతున్నట్టుగా రాజ్ కసిరెడ్డి సోమవారం మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. కానీ అప్పటికే పోలీసులు ఆయన రాకకు సంబంధించి విశ్వసనీయ సమాచారం సేకరించారు. మారుపేరుతో వస్తున్నట్టు కూడా తెలుసుకున్నారు.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు కావాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. సోమవారం ఆ పిటిషన్ ను తిరస్కరించింంది. అప్పటికే సమాచారం ఉన్న పోలీసులు సిద్ధంగా రంగంలోకి దిగారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు.
నోటీసులు ఇచ్చినప్పుడే ఆయన విచారణకు హాజరై ఉంటే గనుక.. పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. కానీ నాలుగు పర్యాయాలు నోటీసులు అందే వరకు ఆయన రకరకాలుగా పోలీసుల్ని మభ్యపెడుతూ పరారైనందువలన పోలీసులు కూడా కేసును సీరియస్ గా తీసుకున్నారు. మంగళవారం విచారణకు వస్తానని ముందు ఒక ఆడియో వచ్చినప్పటికీ కూడా.. ఆయన వస్తాడో రాడో.. అనే సందేహాలు పోలీసుల్లో ఉన్నాయి. అందుకే ఎలాంటి ఛాయిస్ తీసుకోకుండా.. తమకు ఉన్న సమాచారాన్ని బట్టి.. ఎయిర్ పోర్టు వద్దనే పట్టుకున్నారు.

రాజ్ తండ్రి ఉపేందర్ రెడ్డిని విచారించిన సందర్భంగా కూడా పో లీసులు ఆయనకు నచ్చజెప్పారు. ఎంతోకాలం తప్పించుకు తిరగడం సాధ్యం కాదని, విచారణకు సహకరించాల్సిందిగా కొడుక్కు చెప్పాలని వారు సూచించారు. తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే రాజ్ విచారణకు వస్తాననే సంకేతాలతో రాష్ట్రానికి రావడం.. పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాజ్ కసిరెడ్డి విచారణకు సహకరిస్తే గనుక.. లిక్కర్ స్కామ్ లో తెరవెనుక అసలైన వైసీపీ పెద్దలు, బిగ్ బాస్ లు అందరి బండారం బయటపడుతుందని అంతా అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories