వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పాటు సాగించిన అరాచకపాలనలో.. ఆయన ద్వారా అపరిమితమైన వేధింపులకు, కక్షసాధింపు చర్యలకు బలైన అధికారులు ఎవరైనా ఉన్నారా? అంటే మొదటగా చెప్పుకోవాల్సిన పేరు.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. ఆయన చంద్రబాబునాయుడుకు సన్నిహితంగా మెలిగే అధికారి అనే అనుమానంతోను, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారనే కక్షతోను జగన్మోహన్ రెడ్డి సర్కారు ఆయన మీద అనేక అవినీతి కేసులు బనాయించి ముప్పుతిప్పలు పెట్టింది. ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయింది. ఆయనను సర్వీసునుంచి పలుమార్లు సస్పెండ్ చేసింది. ప్రతిసారీ ఆయన ట్రిబ్యునల్ ద్వారా, సుప్రీం కోర్టు ద్వారా పునర్నియామక ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ బేఖాతరు చేసింది. వేరే గతిలేక విధుల్లో చేర్చుకున్నప్పటికీ పోస్టింగు ఇవ్వలేదు. దానిపై ఆయన మళ్లీ న్యాయపోరాటం చేయకగా.. పదవీవిరమణ చేసే రోజున పోస్టింగు ఇచ్చి ఇంటికి పంపింది. అన్ని వేధింపులు అనుభవించిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడు జగన్ వంచిత కుటుంబాలకు అండగా ఉంటానని, వారి తరఫున పోరాడుతానని ఇటీవల ప్రకటించారు. ఆయన తన నిర్దిష్ట ఎజెండాతో ముందుకు వెళుతున్నారు. ఇటీవల కోడికత్తితో హత్యకు యత్నించడాని జగన్ బద్నాం చేసిన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఏబీవీ.. ఇప్పుడు జగన్ సన్నిహితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి డోర్ డెలివరీ చేసిన అతని డ్రైవరు, దళితుడు సుబ్రమణ్యం కుటుంబాన్ని కలిశారు.
దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యంను స్వయంగా హత్యచేసి డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడు. ఆయనే స్వయంగా మృతదేహాన్ని అతని భార్యకు అందించారు. అయితే కొన్నాళ్లు రిమాండులో ఉండి.. ఎంచక్కా బెయిలుపై బయటకు వచ్చి విజయయాత్రలు నిర్వహించారు. ఈ కేసులో జరిగినంత లోపభూయిష్టమైన దర్యాప్తును తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎన్నడూ చూడలేదని.. తాజాగా సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను పరామర్శించిన ఏబీవీ వ్యాఖ్యానిస్తున్నారు.
ఈకేసులో దళిత కుటుంబానికి న్యాయం జరగాలంటే ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి, మళ్లీ మొదటినుంచి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరు, ఎస్పీలకు ఈ మేరకు ఫిర్యాదు చేయబోతున్నట్టు కూడా చెప్పారు.
ప్రస్తుతం పోలీసు గృహ నిర్మాణ శాఖ ఛైర్మన్ గా పదవిలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల వెల్లడించారు. కొత్త పార్టీ పెట్టినా, లేదా, ఏదైనా పార్టీలో చేరినా సరే.. జ.గన్ వంచిత కుటుంబాలను ఆదుకోవడం, వారి తరఫున వారందరికీ న్యాయం జరిగేలా పోరాడడమే తన లక్ష్యం అని స్పష్టీకరించారు. కోడికత్తి శీను, దళిత డ్రైవరు సుబ్రమణ్యం కుటుంబాలను కలిశారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా జగన్ వల్ల జీవితాలన్నీ కోల్పోయిన వారిని కలిసి ఏబీవీ వారి తరఫున పోరాడనున్నట్టు తెలుస్తోంది.