మెగా డీఎస్సీపై.. ఇంత దిక్కుమాలిన విమర్శలా?

మెగా డీఎస్సీ ద్వారా 16వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయడం ద్వారా.. నిరుద్యోగ ఉపాధ్యాయుల ఎదురుచూపులకు భరతవాక్యం పలకడమే కాదు.. విద్యావ్యవస్థను కూడా పరిపుష్టం చేయడానికి చంద్రబాబునాయుడు సర్కారు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రానికి చంద్రబాబునాయుడు పుట్టినరోజు కానుక అన్నట్టుగా.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఎన్నికల నాటి హామీకి చెప్పిన మాట ప్రకారం.. 2025 అకడమిక్ సంవత్సరం మొదలయ్యే వేళకు నియామకాల పర్వం పూర్తయ్యేలాగా షెడ్యూలు కూడా రూపొందించారు. ఇలా కష్టం మొత్తం కూటమి ప్రభుత్వం చేస్తుండగా.. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన క్రెడిట్, కీర్తిప్రతిష్టలు మాత్రం తమకు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరాటపడడం చాలా చిత్రంగా కనిపిస్తోంది.

మెగా డీఎస్సీ ప్రకటన వెలువడగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదంతా తమ ఘనత వల్లనే సాధ్యమైందని చవకబారుగా సొంత డప్పు కొట్టుకుంటున్నారు. తమ పార్టీ చేసిన ఒత్తిడి కారణంగానే.. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందంటూ.. దిక్కుమాలిన వాదన తెరపైకి తెస్తున్నారు. వైసీపీ నేతల వ్యవహార సరళి.. ఎవరో కష్టపడి ఒక వస్తువును తయారుచేస్తే.. దానికి తమ బ్రాండు ప్రైస్ ట్యాగ్ అంటించుకునే కుటిల వ్యాపార ధోరణులు కనిపిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది తొలిసారి కూడా కాదు. మిర్చి రైతులు సరైన ధరలేక ఇబ్బందులు పడుతోంటే.. చంద్రబాబునాయుడు కేంద్రంతో సంప్రదించి ధరలను సవరించే ఏర్పాటు ముందుగానే చేశారు. చంద్రబాబు ప్రయత్నాలు మొదలైన తర్వాత.. ఒక విడత మిర్చియార్డు పర్యటనకు వెళ్లి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తమ ప్రయత్నాల వల్లనే ప్రభుత్వం దిగివచ్చి.. మిర్చిరైతులకు న్యాయం జరిగిందని డప్పు కొట్టుకున్నారు.

మొన్నటికి మొన్న ట్రంప్ సుంకాల కారణంగా రొయ్యరైతుల పరిస్థితి ఆందోళనకరంగా తయారైనప్పుడు జగన్ ఇదే పనిచేశారు. చంద్రబాబు రొయ్యల వ్యాపారులతో చర్చించి రైతులు నష్టపోకుండా నిర్ణయాలు తీసుకోగా, తమ పోరాటాల వల్లనే జరిగినదంటూ జగన్ చెప్పుకున్నారు. ఇప్పుడు మెగా డీఎస్సీ విషయంలో కూడా ఇలాంటి దిక్కుమాలిన వాదన తెరపైకి తెస్తున్నారు.

అయిదేళ్లపాటు అధికారంలో ఉండి ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించిన పాపాన పోని.. జగన్మోహన్ రెడ్డి సర్కారు.. నిరుద్యోగ ఉపాధ్యాయులను దారుణంగా వంచించింది. ఎన్నికల సంవత్సరం వచ్చాక.. డీఎస్సీ పేరుతో డ్రామాలు సాగించి.. టెక్నికల్ కారణాల వల్ల ఆపేసింది. జగన్ ప్రకటించిన ఖాళీలకు రెట్టింపు కంటె ఎక్కువ ఖాళీలు భర్తీ చేసేలా మెగా డీఎస్సీ తీసుకువస్తాం అని చంద్రబాబునాయుడు గత ఎన్నికల ప్రచార సమయంలోనే వెల్లడించారు. 2025 విద్యాసంవత్సరానికి నియామకాలు పూర్తిచేస్తాము అన్నారు. తొలిసంతకాల్లోనే దీనిపై కూడా సంతకం పెట్టారు. మధ్యలో కొన్ని సాంకేతిక కారణాలు, కొత్త ఖాళీల గుర్తింపు, మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఎస్సీ వర్గీరణ కూడా చేయాల్సి వచ్చినందువల్ల.. మరికొంత ఆలస్యం అయింది. ఏదేమైనప్పటికీ.. 2025 విద్యాసంవత్సర ప్రారంభానికి నియామకాలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంత జరుగుతుండగా.. వైసీపీ నాయకులు తమ ఒత్తిడివల్లనే ఇప్పుడు డీఎస్సీ వచ్చిందని చెప్పుకోవడం వారి చవకబారు తనానికి నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories