అమరావతి రాజధాని పనులను ఒకవైపు పరుగులెత్తించే కసరత్తు జరుగుతూ ఉండగానే.. అమరావతిని శోభాయమానమైన నగరంగా తీర్చిదిద్దడానికి ఇంకా ఏమేం అదనపు హంగులు కావాలో.. ఏయే నిర్మాణాలు చేపట్టాలో అనే అధ్యయనం సమాంతరంగా జరుగుతూనే ఉంది. మంత్రి నారాయణ.. ఎలాంటి హడావుడి లేకుండా.. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ అమరావతికి కావాల్సిన హంగులన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. ఆ నడుమ మంత్రి బెంగుళూరుకు వెళ్లి అక్కడి నిర్మాణ సంస్థలతో భేటీలు నిర్వహించి.. అమరావతిలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు మంత్రి నారాయణ అధికారుల బృందంతో కలిసి గుజరాత్ లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. గజరాత్ లో మంత్రి పర్యటన బహుముఖమైన అధ్యయనం దిశగా సాగుతున్నట్టు తెలుస్తోంది.
అమరావతిలోని ఏక్తా నగర్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, పరిసర ప్రాంతాల్లో ఏ రకమైన నిర్మాణాలు అభివృద్ధి చేపట్టారో ఆయన అధ్యయనం చేశారు. అలాగే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని కూడా పరిశీలించబోతున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ పరిశీలన కూడా జరుగుతుంది. అహ్మదాబాద్ లో ఉన్న సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ ను, స్పోర్ట్స్ సిటీని, గిఫ్ట్ సిటీని కూడా పరిశీలిస్తారు.
అమరావతి రాజధాని నగరం అంటే.. కేవలం ఇప్పుడు ప్రారంభించబోతున్న నిర్మాణాలు మాత్రమే కాదు. ఇంకా అనేకానేక హంగులు వచ్చి సమకూరాల్సి ఉంది. ఇందులో భాగంగా భారీస్థాయిలో నందమూరి తారకరాముని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దానికి మోడల్ గా గమనించేందుకే వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు తీరును సందర్శించినట్టు సమాచారం.
అలాగే.. అహ్మదాబాద్ లోని స్పోర్ట్స్ సిటీని కూడా సందర్శించబోతున్నారు. ఏపీ సర్కారు ఇప్పుడు అమరావతికి అనుబంధంగా కొత్తగా విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ కూడా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి చూడడానికే గుజరాత్ వెళ్లారు. అయితే ట్విస్టు ఏంటంటే.. అమరావతిలో స్పోర్ట్స్ సిటీని 1600 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. అహ్మదాబాద్ లో ఇప్పుడున్న స్పోర్ట్స్ సిటీ విస్తీర్ణం 236 ఎకరాలు మాత్రమే. అంటే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అనుకున్న స్థాయిలో పూర్తయితే గనుక.. అనూహ్యమైనంత విరాట్రూపంలో ఉంటుందని అనుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ సిటీ ద్వారా.. అమరావతి దేశానికే స్పోర్ట్స్ రాజధాని అవుతుందని విజయవాడ ఎంపీ, ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కేశినేని చిన్ని అంటే అందులో ఆశ్చర్యం ఏముంది?