రాజ్యసభ ఎంపీ కలలుంటే.. ప్రస్తుతానికి డోర్స్ క్లోజ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటున్న మద్యం కుంభకోణం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో నెంబర్ టు గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సాక్షిగా విచారణకు వచ్చి అనేక వివరాలు వెల్లడించడం చాలా కీలకమైన  సంగతి. అసలు నిందితులను విచారించే ప్రక్రియ వేగవంతం కావడానికి, లోపరహితంగా సాగడానికి ఆయన వాంగ్మూలం ఎంతో ఉపయోగపడుతుంది. మద్యం కుంభకోణంలో ఉన్న అసలు నిందితులను నిగ్గుతేల్చడానికి కూటమి ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి మేలు చేసినట్లే. అంతమాత్రాన అందుకు ప్రత్యుపకారంగా ఆయన రాజ్యసభ ఎంపీ పదవిని ఆశిస్తూ ఉంటే కనుక అది ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

ఆయన చేసిన మేలు గట్టిదే కానీ విజయసాయిరెడ్డి నిజాయితీపై ప్రజలలో ఇంకా అనేక సందేహాలు ఉండగా ఆయనను కూటమి తరఫున రాజ్యసభకు పంపి తమ ప్రతిష్టకు తామే గండి కొట్టుకోవడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదని ప్రజల వ్యాఖ్యానిస్తున్నారు. పైగా ఆయనకు ఇప్పుడు ఎంపీ పదవి ఇచ్చినట్లయితే ‘క్విడ్ ప్రోకో రూపంలో ఇలాంటి బేరం పెట్టి ఆయన ద్వారా జగన్ వ్యతిరేక సాక్ష్యాలు చెప్పించుకున్నారు’ అనే అపకీర్తి తలకు చుట్టుకుంటుందని భయపడుతున్నారు. ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వకపోవడానికి మరో కీలకమైన కారణం కూడా ఉంది.

విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ ఎంపీ స్థానానికి నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మళ్లీ ఆయన పేరే ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి ఆ ఎంపీ టికెట్ దక్కించుకుంటారని ప్రచారం జరిగింది ఒకవేళ ఈ ప్రచారం నిజమే కావచ్చు కూడా.

కానీ ఆయన సిట్ విచారణకు హాజరైన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిట్ విచారణలో కేవలం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద విజయసాయి అనేక ఆరోపణలు గుప్పించారు. మొత్తం కుంభకోణం యావత్తు ఆయనే సూత్రధారిగా, పాత్రధారిగా జరిగిందన్నట్లుగా చెప్పుకొచ్చారు. వసూళ్ల నెట్వర్క్ మొత్తం తన తోడల్లుడు, స్నేహితులు, బంధువులతో రాజశేఖర్ రెడ్డి నడిపించినట్టుగా వివరించారు.
ఈ విమర్శలకు కౌంటర్ గా ఆడియో సందేశం విడుదల చేసిన రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం సుప్రీంకోర్టు లో పిటిషన్ వేసి ఉన్నానని ఆ సంగతి తేలిన తర్వాత మీడియా ముందుకు వచ్చి విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం బయట పెడతానని ప్రకటించారు. రాజశేఖరరెడ్డి బయట పెట్టే వాటిలో విజయసాయి చేసిన అరాచకాలు, ఆకృత్యాలు, అవినీతి కార్యకలాపాలు ఎన్నెన్ని ఉన్నాయో ఇంకా స్పష్టత లేదు. అవేమీ తేలకుండా తొందరపడి ఆయనను రాజ్యసభ పదవికి ఎంపిక చేసి పంపితే రేపు రాజశేఖర్ రెడ్డి ఆయనలోని నెగటివ్ కోణాన్ని బయటపెట్టిన తర్వాత కూటమి పరువు ఢమాల్ అంటుంది- అని విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే ఒకవేళ విజయసాయి పట్ల భారతీయ జనతా పార్టీలో కొంత సానుకూలత ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఒక సముచితమైన పదవిని కట్టబెట్టడం ఇప్పట్లో జరగదని మరికొంత కాలం వేచి ఉండవలసిందేనని అనుకోవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories