జగన్మోహన్ రెడ్డి మోనార్క్ అనీ.. ఆయన ఎవరి మాటా వినరు అనీ అందరూ అంటుంటారు. నిజానికి ప్రభుత్వంలో సలహాదారులు అనే పదం లాంఛనంగా తనకు మేలు చేసిన వారికి పునరావాసం కల్పించడానికే తప్ప, అడ్డదారుల్లో దందాలు చేసే వారిని అధికార పదవుల్లో కూర్చోబెట్టడానికి ఎంచుకునే మార్గమే తప్ప.. ఒకరు సలహా చెబితే వినే అలవాటు జగన్మోహన్ రెడ్డికి ఎన్నడూ లేదని అందరూ అంటుంటారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు కదా పార్టీ నిర్వహణ కూడా జగన్ అత్యంత అరాచకంగా పెత్తందారీ వ్యవస్థ లాగా నడిపిస్తుంటారనే విమర్శలు అనేకం ఉంటాయి. పార్టీలో సీనియర్లు, జూనియర్లు తేడా లేకుండా ఎంతటి వారైనా సరే ఆయన చెప్పింది చేయాలే తప్ప ఎదురు మాట్లాడ్డానికి వీల్లేదని వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన సొంత బాబాయి ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డి మాటలను కాస్త లోతుగా గమనిస్తే ఇదే సంగతి అర్థం అవుతుంది. జగన్ ఫ్యూడల్ భావజాలానికి ప్రతీక అని తెలుస్తుంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడి, ఆయనకు విషం ఎక్కిస్తున్నారని ఆ కోటరీ చేసే దుష్ప్రచారాలను భరించలేకనే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండు రోజుల కిందట మళ్లీ చెప్పారు. విజయసాయి మాటలకు కౌంటర్ ఇవ్వడానికి వై వి సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు కోటరీ లో ఉంటూ పెత్తనం చెలాయించింది ఆయనే కదా అంటూ విజయసాయిని టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది. అయితే విజయసాయి ఆరోపణలు ఖండించడానికి చెప్పిన మాటలు జగన్ బుద్ధిని బయటపెడుతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అంటూ ఎవరు ఉండరని నెంబర్ వన్ నుంచి హండ్రెడ్ వరకు అన్ని జగన్మోహన్ రెడ్డి అని వైవి సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఇదేదో గొప్ప ఘనకార్యం అయినట్టుగా ఆయన వివరణ ఇస్తున్నారు గానీ.. ఈ పోకడ జగన్లోని ఫ్యూడల్ బుద్ధులకు నిదర్శనంగా ప్రజలు గుర్తిస్తున్నారు. ఒక పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉండడం అనేది తప్పేమీ కాదు. అధినేతను మించిన తెలివితేటలు, సామాజిక స్పృహ ఉండే నాయకులు ఎంతో మంది ఉంటారు. వారు తమ ఆలోచనలను కూడా పంచుకుంటూ అధినేత ద్వారా వాటిని అమలులో పెట్టి పార్టీని ముందుకు నడుపుతుంటారు. నెంబర్ 2 అంటూ ఒక స్థానం కాకపోవచ్చు కానీ ఆ స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉండడం ప్రతి పార్టీకి కూడా ఎంతో అవసరం. కానీ జగన్ అలా ఎవరిని ప్రోత్సహించరు, ఖాతరు చేయరు, లెక్క చేయరు అనే సంగతి వైవీ సుబ్బారెడ్డి మాటల్తో తెలుస్తోంది. ఒకటి నుంచి వంద వరకు తానే అంటే ఏ నిర్ణయమైనా ఆయనదే అని నమ్మాల్సిందే! అలాంటప్పుడు ఎదురయ్యే పరాజయాలకుచ పార్టీ నుంచి నేతలను నిష్క్రమిస్తూ తగులుతున్న పరాభవాలకు అన్నింటికీ జగన్మోహన్రెడ్డి బాధ్యత వహించాలి తప్ప మరొకరి మీద నిందలు వేసి కాలం గడుపుకోవడం కరెక్ట్ కాదు కదా అని కూడా ప్రజలు అనుకుంటున్నారు.