కన్నతల్లికి జగన్ బర్త్‌డే గ్రీటింగ్స్ కూడా చెప్పరా?

కన్నతల్లికి గిఫ్టుగా ఇచ్చిన షేర్లను కూడా తిరిగి వెనక్కు కావాలని.. అవి ఇచ్చినప్పుడు ఆమె పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఇప్పుడు లేవు గనుక.. ఆ షేర్లను వెనక్కు తీసుకునే హక్కు తనకు ఉన్నదని ఏకంగా న్యాయపోరాటం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. కనీసం కన్నతల్లి విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా ఖాళీ లేదా? నేరుగా ఫోను చేసి చెప్పారో లేదో గానీ.. ఆయన ఎక్స్ ఖాతా మాత్రం.. వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు నాడు చాలా చాలా సైలెంట్ గా ఉంది. మరొకవైపు జగన్ చెల్లెలు.. తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. చాలా భావోద్వేగభరితమైన పోస్టు పెట్టిన నేపథ్యంలో జగన్ అసలు గ్రీటింగ్స్ చెప్పకపోవడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

వైఎస్ విజయలక్ష్మి శనివారం నాడు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో అనుబంధం ఉన్నవాళ్లు, రాజకీయ నాయకులు, వైఎస్ అభిమానులు అందరూ ఆమెకు వివిధ మాధ్యమాల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె కుమార్తె షర్మిల కూడా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, ఎక్స్ ఖాతాలో కూడా గ్రీటింగ్స్ చెప్పారు. తల్లితో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ.. ‘నాకు జన్మనిచ్చి.. నా జన్మకు సార్థకత చేకూరేలా ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారు.. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అమ్మా.. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనశ్శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని షర్మిల పోస్టు పెట్టారు.

కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాట మాత్రంగానైనా గ్రీటింగ్స్ చెప్పలేదు. అవతలి నాయకులు ఈయన చెప్పిన గ్రీటింగ్స్ ను పట్టించుకుంటున్నారో లేదో తెలియకపోయినా.. ఎక్కడెక్కడి వారికో జగన్ గ్రీటింగ్స్ చెబుతుంటారు. కానీ.. కన్నతల్లికి మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
తల్లీ కొడుకుల మధ్య ఇప్పుడు ఆస్తుల వివాదం నడుస్తోంది. బహిరంగంగా క్రిస్ మస్ రోజున, వైఎస్ జయంతి, వర్ధంతి రోజుల్లో, ఇంకేదైనా శుభాశుభ కార్యక్రమాల్లో తారసపడినప్పుడు మాత్రం తల్లిని చూసి జగన్ నవ్వుతారు. ఆమె ఆయనను ముద్దు పెట్టుకుంటుంది. అంతకుమించి తల్లిపట్ల జగన్ విముఖంగానే ఉన్నట్టు శనివారం పరిణామాలు తెలియజేస్తున్నాయి.

విశాఖ నగర కార్పొరేషన్ తమ చేయిజారిపోకుండా వైసీపీ నానా పాట్లు పడినప్పటికీ.. నిలబెట్టుకోలేకపోయింది. జగన్ పాపం దానికి సంబంధించిన టెన్షన్ లో ఉన్నారో ఏమో తెలియదు. దానికి మించి.. లిక్కర్ స్కామ్ లో కీలకంగా సూత్రధారిగా అందరూ భావిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పొద్దున నుంచీ సిట్ పోలీసుల విచారణలో ఉన్నారు. ఆయన విచారణలో ఏం వివరాలు చెబుతారో.. కొంపదీసి పోలీసులు ఆయనను అరెస్టు చేస్తారో ఏమోఅనే భయంతో ఉన్నారో తెలియదుగానీ.. జగన్ మొత్తానికి తల్లి పుట్టినరోజును మరచిపోయినట్టుగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories