కసిరెడ్డి కండిషన్ : బెయిలిస్తే అందుబాటులో ఉంటా!

సాధారణంగా న్యాయస్థానాలు నిందితులకు బెయిలు ఇవ్వాలంటే కొన్ని కండిషన్లు పెడుతుంటాయి. కానీ.. లిక్కర్ స్కామ్ లో ప్రధానపాత్రధారిగా వినిపిస్తున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తీరే సెపరేటు! ఆయన కొన్ని కండిషన్లు పెట్టి మరీ.. ముందస్తు బెయిలు పిటిషను వేస్తున్నాడు. ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఎదుర్కొన్నప్పటికీ.. పోలీసులకు స్పందించకుండా.. పరారీలో ఉంటూ వారిని ముప్పుతిప్పలు పెడుతున్న.. రాజశేఖర రెడ్డి.. తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిలుకోసం పిటిషను దాఖలు చేశారు. తనను అరెస్టు చేస్తారనే భయం ఉన్నదని, ముందస్తు బెయిలు ఇస్తే, విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉంటానని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా పరారీలో ఉన్న వ్యక్తి.. ఇప్పుడు హఠాత్తుగా కొత్తపాట ఎత్తుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తన ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా సిట్ పోలీసులు సోదాలు నిర్వహించారని, ఈ పరిణామాలన్నీ గమనిస్తోంటే తనను ఏ క్షణాన్నయినా అరెస్టు చేస్తారనే భయం కలుగుతోందని కసిరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన పోలీసులు ఇచ్చిన తొలి నోటీసులకే స్పందించి ఉంటే.. విచారణకు హాజరై ఉంటే.. అసలు ఆయన ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించే అవసరమే ఏర్పడి ఉండేది కాదు కదా.. అనే వాదనకు ఆయన ఏం చెబుతారో మరి?

రాజశేఖర రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ అడుగుతున్నారే గానీ, ఆయన తీరులో ఏమాత్రం తేడా రాలేదు. గత ప్రభుత్వ కాలంలో.. తాను కేవలం ఐటీ సలహాదారుగా పనిచేశానని, మద్యం పాలసీ విషయంలో జరిగిన పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. కేవలం ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తిని అని లిక్కర్ స్కామ్ లో తనను ఇరికించాలని చూడడం, విచారించడం చట్టవిరుద్ధమని ఆయన వాదిస్తున్నారు.
ఈ కేసు విషయంలో అన్నీ తానై వ్యవహరించిన ఏపీబీసీఎల్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డిని మాత్రం మాతృసంస్థకు ప్రభుత్వం పంపిందని, తన లాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్నారని కసిరెడ్డి ఆరోపించడం విశేషం. ఆయన ఇదివరకే తాను ఐటీ సలహాదారు గనుక.. తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ హైకోర్టులో ఒక పిటిషన్ వేయగా.. అది తిరస్కరణకు గురైంది. ఈ స్కామ్ విచారణలో ముందుకు పడుతున్న ప్రతి అడుగు కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్రను నిర్ధారిస్తుండగా.. ఆయన మాత్రం ముందస్తు బెయిలు కావాలంటూ కోర్టును ఆశ్రయించడం విస్మయపరుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories