దేశానికే ఓ మోడల్ సిస్టమ్ అందించనున్న లోకేష్!

బెట్టింగ్ యాప్ లు అనేవి యువతరాన్ని, మధ్య తరగతి జీవితాలను ఎంతగా సర్వనాశనం చేస్తున్నాయో మనం ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కేవలం బెట్టింగ్ యాప్ ల మాయలో ఇరుక్కుని, బయటకు రాలేక అప్పులు కూడా చేసి.. మొత్తం పోగొట్టుకుని సిగ్గుతో బాహ్యప్రపంచానికి మొహం కూడా చూపించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారే.. దేశంలో వందలు వేల మంది ఉంటున్నారు. బెట్టింగ్ యాప్ ల గురించి ప్రమోట్ చేస్తూ వీడియోలు చేసిన వారి మీదనే తీవ్రమైన కేసులు నమోదు కావడం కూడా చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో.. ఈ బెట్టింగ్ యాప్ లను ప్రభుత్వం అడ్డుకోలేదా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతాయి. అయితే ఈ దిశగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఒక గొప్ప శుభవార్త చెబుతున్నారు.

బెట్టింగ్ యాప్ లకు ముగింపు పలకాల్సిన అవసరం ఉన్నదని లోకేష్ అంటున్నారు. బెట్టింగ్ యాప్ ల బారిన పడకుండా అవగాహన కల్పించడంతో పాటు, ఆయా యాప్ ల మీద చర్యలు తీసుకోవడమేపరిష్కారం అని లోకేష్ చెబుతున్నారు. ఇందుకోసం బెట్టింగ్ నిరోధక విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. ఆధునిక సాంకేతికత ఉపయోగించి.. బెట్టింగ్ యాప్ లను అడ్డుకోవడానికి కొత్త విధానం తేబోతున్నామని, దీని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని.. తాము తీసుకురాబోయే విధానం.. దేశం మొత్తానికి కూడా ఒక రోల్ మోడల్ లా నిలుస్తుందని లోకేష్  ధీమా వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన అన్ని మార్గాలను అన్వేషించడం ద్వారా.. బెట్టింగ్ యాప్ లకు ముకుతాడు వేయనున్నట్టుగా చెబుతున్నారు.

బెట్టింగ్ యాప్ లను అడ్డుకునేలా ఏపీ ప్రభుత్వం సరైన చట్టాన్నే గనుక రూపొందిస్తే.. కేవలం.. అది ఏపీలోని బాధితుల్ని, యువతరాన్ని కాపాడే వ్యవహారం మాత్రమే కాదు. యావత్ దేశానికి కూడా మేలు చేస్తుంది. కొన్ని లక్షల కోట్ల కుటుంబాలు ఈ ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడుతుంది. అలాంటి కొత్త వ్యవస్థకు ఏపీ ప్రభుత్వమే లోకేష్ సారథ్యంలో కసరత్తు చేస్తుండడం గొప్ప విషయం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

బెట్టింగ్ యాప్ లను, వాటి ప్రమోషన్ లను అరికట్టాలంటూ.. యూట్యూబర్ అన్వేష్ చేసిన పోస్టుకు స్పందించిన లోకేష్, ఇప్పటికే ఈ దిశగా జరుగుతున్న కసరత్తును బయటపెట్టారు. మొత్తానికి సమాజానికి పట్టిన బెట్టింగ్ చీడకు విరుగుడుగా ఏపీలో కొత్త పాలసీ రాబోతుండడం శుభపరిణామం. 

Related Posts

Comments

spot_img

Recent Stories