మద్యం కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ విచారణకు హాజరైన తర్వాత.. మాజీ ఎంపీ విజయసాయిరెడ్ది ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. చాలా చిత్రమైన సంగతులు వెల్లడించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడానికి చేసే ప్రయత్నంలో ఆయన విలేకర్లకు పలు కౌంటర్లు ఇచ్చారు. బిగ్ బాస్ ఎవ్వరో తనకు తెలియదని అంటూనే.. మీకు తెలిస్తే నాకు చెప్పండి అంటూ జోకారు. రాజ్ కసిరెడ్డి పరారీ గురించి అడిగితే.. వెళ్లి పోలీసుల్ని అడగండి అన్నారు. ఇలాటి అనేక సంగతుల్లో భాగంగా రాజకీయ పునరాగమనం గురించి ఆయన చెప్పిన సంగతి అతిపెద్ద కామెడీ అనే అనాలి.
ప్రజలు కోరితే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని.. ప్రజలు ఎప్పుడు కోరితే అప్పుడు వస్తానని ఆయన వెల్లడించారు. ఈ మాటలు విన్న జనం మాత్రం.. అసలు విజయసాయి రెడ్డి జీవితంలో గతంలో ఎన్నడైనా ప్రజలు ఆయన్ను రాజకీయాల్లోకి రమ్మని అన్నారా.. అంటూ నవ్వుకుంటున్నారు.
విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత.. రాజ్యసభ ఎంపీ పదవిని కూడా వదులుకున్నారు. ఆ తర్వాత ఆయన బిజెపిలో చేరి రాష్ట్ర పార్టీ సారథ్యం తీసుకుంటారనే పుకార్లు వచ్చాయి. ఇప్పుడు విజయసాయి ఖాళీచేసిన ఎంపీ స్థానానికి మళ్లీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఆయనే బిజెపిలో చేరి అటునుంచి కేండిడేట్ అవుతారనే ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారాలను విజయసాయి ఖండించారు. ఇవన్నీ మీడియా సృష్టి అన్నారు.
సాక్షి చానెల్ లో తన గురించి విమర్శలు చేస్తున్నారని.. ఆ ముసలాయన వ్యవసాయం చేసుకుంటానన్నాడు.. మళ్లీ రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నాడు.. అంటున్నారని ఆయన తప్పుపట్టారు. అయినా తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే గనుక.. తనకు ఒకరి పర్మిషన్ అవసరం లేదని.. ప్రజలు తను రావాలని ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వచ్చేస్తానని అంటున్నారు.
అయినా ఇక్కడ ప్రజలు సందేహం ఒక్కటే.. గతంలో మాత్రం ఎన్నడైనా ఆయన్ను ప్రజలు రాజకీయాల్లోకి రమ్మని కోరారా? ఏదో.. జగన్ కు చార్టర్డ్ అకౌంటెంటుగా ఉంటూ.. ఆర్థిక మతలబులు చేయడంలో, ఆర్థిక తప్పుడు పనులు చేయడంలో ప్రధానమైన బ్రెయిన్ గా జగన్ కు సేవలందించినందుకు.. పార్టీ ఆర్థిక లావాదేవీలు, వసూళ్లు బాగా నిర్వహించినందుకు.. ఆయన జగన్ ప్రాపకంతో రాజ్యసభ ఎంపీ అయ్యారే తప్ప.. ప్రజలు నమ్మి, ప్రజలు ఎన్నుకుని.. ప్రజలు విశ్వాసం ఉంచి, వారు కోరుకుంటే కనీనసం వార్డు మెంబరు అయిన చరిత్ర అయినా విజయసాయికి ఉందా అని ప్రజలు అంటున్నారు.
గత ఎన్నికల్లో వేమిరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయడం వలన.. వైఎస్సార్ కాంగ్రెస్ కు వేరే గతి లేక నెల్లూరు ఎంపీగా ఆయన పోటీచేస్తే ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఇప్పుడాయన ప్రజలు కోరితే వస్తా.. అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రజలు కోరితేనే వస్తా అనే నేత.. ధైర్యముంటే డైరక్ట్ ఎలక్షన్స్ లోకే రావాలని.. నాయకుల కాళ్లు పట్టుకుని దొడ్డిదారిలో రాజ్యసభకు వచ్చే ఆలోచనలు మానుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.