వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. శుక్రవారం లిక్కర్ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ విచారణకు హాజరయ్యారు. మూడుగంటల పాటు ఆయనను సిట్ అధికారులు విచారించారు. బయటకు వచ్చిన తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో అడిగిన విషయాల గురించి ఆయన విపులంగా చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా గమనిస్తోంటే.. క్రిమినల్ మైండ్ సెట్ కలిగిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆ సంగతి గుర్తించకుండా పార్టీలో తానే ప్రోత్సాహించానని, అనేక బాధ్యతలు అప్పగించానని విజయసాయి చెప్పారు. కసిరెడ్డి తనను మోసం చేశాడని అన్నారు. ఏం మోసం చేశాడనేది చెప్పలేదు గానీ.. విజయసాయిరెడ్డి మాటలను జాగ్రత్తగా గమనిస్తోంటే.. తనను మోసం చేశాడనే కక్షతోనే రాజ్ కసిరెడ్డిని పూర్తిగా ఇరికించేందుకే సిట్ విచారణకు ఆయన హాజరైనట్టుగా కనిపిస్తోంది.
లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉందని అనేక మంది ఇతరుల పాత్ర గురించి తనకు తెలియదని గుర్తులేదని విజయసాయిరెడ్డి చెప్పడం కూడా అనుమానాస్పదంగా ఉంది. విచారణలో ఏం చెప్పారనేది స్పష్టత లేదు. కానీ, ప్రెస్ తో చెప్పిన మేరకు ఆయన మాటలను లోతుగా గమనిస్తే.. లిక్కర్ కుంభకోణంలో కొందరి పేర్లను పూర్తిగా బలంగా ఇరికించడానికి, కొందరిని రక్షించడానికి ఒక నిర్దిష్టమైన ఎజెండాతో విజయసాయి వచ్చారేమో అనే అనుమానం మనకు కలుగుతుంది.
రాజ్ కసిరెడ్డిని పార్టీలోని పెద్దలే తనకు పరిచయం చేశారని, ఆయన చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడని తెలియక తాను చాలా ప్రోత్సహించానని విజయసాయి అంటున్నారు. కానీ.. ఆయనను పరిచయం చేసిన పార్టీ పెద్దలెవ్వరో చెప్పడం లేదు. అలాగే లిక్కర్ కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఉన్నదో లేదో తనకు తెలియదని అనడం కూడా చిత్రంగా ఉంది. అలాగే.. గతంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, మరో అధికారి సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలాలలో ఉన్న ఒక విషయాన్ని కూడా విజయసాయి ధ్రువీకరించడం లేదు. లిక్కర్ పాలసీ తయారీకి సంబంధించి.. విజయవాడలోని విజయసాయి ఇంట్లో జరిగిన రెండో సమావేశంలో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి పాల్గొన్నారా అని అడిగిన సిట్ బృందానికి తనకు గుర్తున్నంతవరకూ లేదు అని చెప్పినట్టుగా విజయసాయి వెల్లడించారు. గుర్తులేదు అంటున్నారంటే… వారిద్దరి పేర్లను ఆయన బయటకు రానివ్వడం లేదు.
అదే సమయంలో.. రాజ్ కసిరెడ్డి కి సంబంధించి ఆయన సన్నిహితులందరికీ లిక్కర్ కుంభకోణంలో పాత్ర ఉన్నది చాలా విపులంగా చెబుతున్నారు. రాజ్ కసిరెడ్డది తోడల్లుడు అవినాష్ రెడ్డి (కడప ఎంపీ కాదు), చాణక్యరాజ్ అలియాస్ ప్రకాష్, కిరణ్, సునీత్, సయీఫ్ తదితరులు నెట్ వర్క్ లో ఉన్నారు అని చెప్పారు. రాజ్ కసిరెడ్డి ఒక్కడే నిందితుడు అన్నట్టుగా ఆయన పాత్రను బలపరచడానికి ఇన్ని పేర్లు చెబుతున్న విజయసాయి.. కీలక అధికార్లు, మిథున్ రెడ్డి పేర్ల విషయంలో మాత్రం తెలియదు, గుర్తులేదు అనడం తమాషాగా ఉంది.