జగన్ వంచితులకు బాబు సర్కార్ శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు సంబంధించిన మెగా డీఎస్సీ ప్రకటన ఇంకా వెలువడనేలేదు. నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్న ఈ ప్రకటన మేలో రావచ్చు అని అంటున్నారు. కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా ఉపాధ్యాయ నియామకాలు కూడా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకమార్లు వెల్లడించారు.

అయితే మెగా డీఎస్సీ ప్రకటన రావడానికి  ముందే నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఒక గొప్ప శుభవార్త ప్రకటించింది కూటమి సర్కార్. ఈ నిర్ణయం ద్వారా ఐదు సంవత్సరాలపాటు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించకపోవడం వలన.. వంచనకు గురైన వారికి గొప్ప మేలు జరుగుతుంది. మెగా డీఎస్సీ రాసే అభ్యర్థుల వయోపరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా కొన్ని వేల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వైయస్ జగన్ అధికారంలో ఉండగా ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు. ఉపాధ్యాయ వర్గాల పట్ల ఆయన కక్షపూరితంగా, అవమానకరంగా వ్యవహరించారు. నిరుద్యోగ ఉపాధ్యాయుల ఉసురుపోసుకున్నారు. వ్యతిరేకత తప్పదనే భయంతో పరిపాలన చివరి సంవత్సరంలో డీఎస్సీ అంటూ ఒక డ్రామా నడిపించారు గానీ, అది కార్యరూపం దాల్చలేదు.

గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా పెట్టకపోవడం వలన అనేకమంది అభ్యర్థులు వయోపరిమితిని దాటిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నికల ప్రచార సమయంలో చెప్పినట్లుగా తొలి సంతకాలలో ఒకటి మెగాడీఎస్సి నిర్వహణ మీద చేశారు. అయితే జగన్ వంచన కారణంగా వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థుల గోడు ఎవరికి పట్టకుండా ఉండిపోయింది. వారి జీవితాలలో వెలుగులు నింపుతూ కూటమి సర్కారు తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. అభ్యర్థుల వయోపరిమితిని 42 నుంచి 44 ఏళ్లకు పెంచారు. అలాగే కటాఫ్ తేదీని 2024 జులై ఒకటిగా నిర్ణయించడం కూడా వయోపరిమితి దాటే వారికి ఎంతో మేలు చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories