గత ప్రభుత్వపు అక్రమాలు అరాచకాలు మాత్రమే కాదు.. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జగన్మ్మోహన్ రెడ్డితో క్విడ్ ప్రోకో ఒప్పందాలు చేసుకుని, ఆయన ద్వారా అడ్డదారుల్లో లబ్ధిపొంది ఆయనకు అడ్డగోలుగా దోచిపెట్టిన వారిలో మరో ప్రముఖ సంస్థకు పెద్ద దెబ్బే తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సహనిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్-ఈడీ ఎటాచ్ చేసింది. 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసినట్టుగా ప్రకటించారు.
వైఎస్ఆర్ సీఎంగా ఉన్న రోజుల్లో.. జగన్ అనేక సంస్థలకు ప్రయోజనాలు చేకూరుస్తూ తాను భారీగా లబ్ధి పొందిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయనతో అలాంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నందుకు ఆ సంస్థలన్నీ మూల్యం చెల్లిస్తూనే వస్తున్నాయి. ఇన్నేళ్లలో పలుసంస్థల ఆస్తులు ఎటాచ్ అయ్యాయి. ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ వంతు వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్ కు లీజుకు ఇచ్చింది. ఈ లీజు వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ సీబీఐ గతంలోనే ఆరోపించింది. జగన్ తో కలిసి దాల్మియా సిమెంట్స్ క్విడ్ ప్రోకో కు పాల్పడి అక్రమంగా సున్నపురాయి గనుల లీజు పొందినట్లుగా సీబీఐ 2013లోనే చార్జిషీటు దాఖలు చేసింది.
ఈ డీల్ సెట్ చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పట్లోనే రూ.150 కోట్ల మేర అక్రమంగా లబ్ధిపొందినట్టుగా సీబీఐ లెక్కతేల్చింది. రఘురామ్ సిమెంట్స్ లో రూ.95 కోట్ల విలువైన షేర్లను, రూ.55 కోట్ల రూపాయలను హవాల రూపంలోను దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్లు తేలింది. సీబీఐ చార్జిషీటు వేసిన తర్వాత.. దాని ఆధారంగా ఈడీ రంగంలోకి దిగతింది. మనీలాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు జరిపి అక్రమాలు నిజమే అని లెక్కతేల్చింది. మొత్తానికి తాజాగా రూ.793 కోట్ల విలువైన దాల్మియ సిమెంట్స్ ఆస్తులను ఎటాచ్ చేసింది.
తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశాన్ని వాడుకుని వేలాది కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో అక్రమాలకు పాల్పడినట్టుగా సీబీఐ చార్జిషీట్లు వేసినా.. మూలకారకుడు అయిన వైఎస్ జగన్ మాత్రం నింపాదిగా బెయిలుమీద బాహ్యప్రపంచంలోనే ఉంటూ.. ఒక దఫా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అదేసమయంలో ఆయనతో అనుబంధం పెట్టుకుని అనుచిత ప్రయోజనాలు పొందినందుకు.. అనేక సంస్థలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఆస్తులు ఎటాచ్ అయ్యాయి. ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ వంతు వచ్చింది.