మోసం సంగతి తేలాకే.. బెయిలు సంగతి తేలుస్తాం!

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. తాను ఆయనకు సలహాదారుగా పనిచేశానని.. ప్రభుత్వం తనకు గన్ మెన్ లను కూడా ఏర్పాటుచేసిందని.. పోలీసుల విచారణలో వారినే బెదిరించడానికి ప్రయత్నించిన రౌడీషీటరు బోరుగడ్డ అనిల్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిలుకోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో హైకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ ఇదివరకు బెయిలుకోసం సమర్పించిన డాక్టరు సర్టిఫికెటు ఫోర్జరీది అని ఫిర్యాదులు రావడంతో.. అప్పుడు చేసిన మోసం సంగతి ఇదమిత్థంగా తేలేవరకు.. ఈ బెయిలు పిటిషన్ ను పరిశీలించేదే లేదని తేల్చిచెప్పింది.

రౌైడీషీటరు బోరుగడ్డ అనిల్ తన తల్లి గుండె సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా గతంలో హైకోర్టుకు వెల్లడించి.. బెయిలు పొందారు. బెయిలుకోసం ఆయన గుంటూరు డాక్టరు ఇచ్చిన సర్టిఫికెట్ సమర్పించారు. అయితే ఆ సర్టిఫికెట్ లోని చేతిరాత, సంతకం తనవి కాదని ఆ డాక్టరు రాఘవశర్మ పోలీసువిచారణలో తేల్చి చెప్పారు. బోరుగడ్డ ఫోర్జరీ లెటరు కోర్టుకు సమర్పించి, మోసపూరితంగా బెయిలు పొందినట్టుగా తేలింది. పోలీసుల విచారణలో చెన్నై ఆసుపత్రిలో తల్లిని  పరామర్శించడానికి అనిల్ వెళ్లినట్టుగా కూడా సీసీ ఫుటేజీలు చూపించలేదు. బెయిలు ముగిసిన తర్వాత తిరిగి లొంగిపోయిన బోరుగడ్డ ఇప్పుడు మళ్లీ బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఆ సంతకం తనది కాదు అంటూ డాక్టరు రాఘవశర్మ పోలీసులకు చెప్పడాన్ని బోరుగడ్డ అనిల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో డాక్టరు వాంగ్మూలాన్ని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేటు తో రికార్డు చేయించి తమకు పంపాలని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిని హైకోర్టు కోరింది. పోలీసులు రికార్డు చేసిన డాక్టరు వాంగ్మూలాన్ని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పంపాలని ఆదేశించింది.

నకిలీ డాక్టరు సర్టిఫికెటుతో చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకుంటూ, అది నిజమేనని, డాక్టరు మాట మారుస్తున్నారని బుకాయిస్తూ బోరుగడ్డ అనిల్ కోర్టులో వాదిస్తున్నారు. ఆ మోసం సంగతి తేలకుండానే మళ్లీ బెయిలు కావాలని అభ్యర్థిస్తున్నారు. అయితే హైకోర్టు మాత్రం ఆయన తరఫు వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇదివరకు చేసిన మోసం సంగతి తేలేదాకా.. ఈ బెయిలు పిటిషన్ ను కనీసం పరిశీలించేది లేదని తేల్చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టరు వాంగ్మూలం తీసుకున్న తర్వాత.. బోరుగడ్డ చేసిన మోసం ధ్రువపడితే గనుక.. హైకోర్టు సీరియస్ గా స్పందించవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories