జగన్ హయాంలో కొత్త లిక్కర్ పాలసీ ముసుగులో జరిగిన మూడువేల కోట్లకు పైబడిన అవినీతి కుంభకోణంలో కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డేనని వైఎస్సార్ సీపీ అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇటీవల విస్పష్టంగా ప్రకటించారు. దీనిపై అవసరమైనప్పుడు తనకు తెలిసిన అన్ని వివరాలు బయటపెడతానని కూడా ఆయన అన్నారు.
ఇప్పుడు విచారణ ఊపందుకుంటున్న తరుణంలో.. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నోటీసులు అందుకోవడానికి కూడా అందుబాటులో లేకుండా పరారీలో ఉన్న నేపథ్యంలో.. వీలైనని వివరాలు తెలుసుకోవడానికి.. విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిచారు సిట్ పోలీసులు. 18న శుక్రవారం విచారణకు రావాల్సిందిగా పిలిస్తే.. 17న గురువారం వస్తానంటూ విజయసాయి తొలుత అధికార్లకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత.. ఇవాళ రాలేకపోతున్నానని.. శుక్రవారమే విచారణకు వస్తానని సమాచారం పంపారు. ముందే వస్తానని ఆయనే ప్రకటించి.. తర్వాత.. ఆయనే వెనక్కు తగ్గడం వెనుక మతలబు ఏమిటి? అనే విషయంలో రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.
జగన్ ప్రభుత్వ కాలంలో పార్టీకి జాతీయ ప్రధానకార్యదర్శిగా, నెంబర్ టూ గా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డికి లిక్కర్ స్కామ్ సంగతులు సంపూర్ణంగా తెలిసే అవకాశం ఉంది. ఆయన ఇటీవల కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ప్రకటించినప్పటినుంచే వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు వణుకుతున్నాయి. ఏ క్షణాన ఆయన ఏం బాంబు పేలుస్తారో అని భయపడుతున్నాయి. తీరా ఇప్పుడు ఆయనను సాక్షిగా రావాలని సిట్ పిలవడంతో వారి భయం పరాకాష్టకు చేరుకున్నదని సమాచారం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిఉన్న విజయసాయి సన్నిహితుల ద్వారా ఆయన మీద బీభత్సంగా ఒత్తిళ్లు తెస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఒత్తిళ్లను ఊహించే విజయసాయిరెడ్డి ఒక రోజు ముందుగానే విచారణకు వెళ్లాలని అనుకున్నారని.. అయితే ఈలోగా.. ఒత్తిళ్లు చేసేవాళ్లే ఆయనను బతిమాలి ఆపారని కూడా తెలుస్తోంది. విజయసాయి సిట్ విచారణకు హాజరు కాకుండా అసాధ్యం అని పార్టీ వారికి కూడా తేలిపోయింది. కాకపోతే.. ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు జరిపి.. ఆయన లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏ వాస్తవాలను వెల్లడించదలచుకున్నారో.. వాటిని ఫిల్టర్ చేయాలని ఆయన సన్నిహితులు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తొలుత గురువారం వస్తానని చెప్పిన ఆయన, వాయిదా వేసుకోవడానికి కారణం అదేనని అంటున్నారు.
కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఎటూ చెప్పేశారు గనుక.. ఆయన గురించి ఎంతైనా చెప్పుకోవచ్చునని, కాకపోతే.. లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారులైన ప్రధాన వ్యక్తులు, ముఖ్యనేతలు ఎవరు? అనే విషయంలో గోప్యత పాటించాలని.. ఇన్నాళ్లు పార్టీ ఆయనకు ఇచ్చిన ప్రాధాన్యానికి ఆ మాత్రం సాయం చేయాలని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణలో ఆయన కీలక వ్యక్తుల పేర్లు బయటపెడితే గనుక.. ఆ సాక్ష్యం ఆధారంగా వారి పేర్లను కేసులో జతచేసి వారిని కూడా విచారణకు పిలుస్తారనే భయంలో వారున్నట్టుగా విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.