రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాలుగా కొన్ని నిర్మాణాలను ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో రెండింటికి ఆల్రెడీ టెండరు దారులు కూడా ఖరారయ్యారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి ఎల్ 1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చేశారు. ప్రధాని శంకుస్థాపన చేసే కార్యక్రమం లాంఛనంగా పూర్తయిన వెంటనే ఒక్కసారిగా శరవేగంగా నిర్మాణాలు ప్రారంభం అవుతాయి. అదే సమయంలో.. మూడో ఐకానిక్ భవనం అయిన సచివాలయం కోసం తాజాగా టెండర్లు పిలుస్తున్నారు. అయిదు ఐకానిక్ టవర్లుగా సచివాలయ భవనాన్ని నిర్మించనున్నారు. 4688 కోట్ల వ్యయంతో ఆహ్వానించిన టెండర్లకు మే1 వతేదీ గడువు విధించారు. అదేరోజు సాయంత్రం టెండర్లు తెరిచి ఎల్ 1 లను ఖరారు చేస్తారు. ఈ సచివాలయ భవనాల నిర్మాణాలు కూడా మేనెలలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
డయాగ్రిడ్ విధానంలో ఈ ఐకానిక్ టవర్ల డిజైన్లను ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. మొత్తం అయిదింటిలో నాలుగు టవర్లు 39 అంతస్తులతో నిర్మాణం అవుతాయి. సీఎం కార్యాలయం ఉండే జీఏడీ టవర్ మాత్రం 47 అంతస్తులుగా ఉంటుంది. దీని టెర్రస్ మీద ముఖ్యమంత్రి ప్రయాణాలకు అనువుగా హెలిప్యాడ్ కూడా నిర్మిస్తారు. మొత్తం అయిదు టవర్ల విస్తీర్ణం కలిపి 68.98 లక్షల చదరపు అడుగులు ఉంటుంది.
60వేల టన్నుల స్టీల్ ను ఈ అయిదు టవర్లకు వినియోగించనున్నారు. దీనికోసం సీఆర్డీయే అధఇకారులు స్వయంగా వివిధ ఉక్కు పరిశ్రమలను, ఫ్యాబ్రికేషన్ వర్క్ షాపులను సందర్శించారు. రాయగఢలోని ఉక్కు పరిశ్రమ నుంచి స్టీల్ కొనుగోలు చేసి బల్లారిలోని జిందాల్ కర్మాగారం, తిరుచిరాపల్లిలోని ఎవర్ సెండే కంపెనీ లకు చెందిన వర్క్ షాపుల్లో ఫ్యాబ్రికేషన్ చేయించి.. అమరావతికి తరలించి.. ఈ టవర్ల నిర్మాణంలో వినియోగిస్తారు.
అయిదు టవర్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ అయిదు టవర్ల నిర్మాణ పనులను కూడా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఆహ్వానించారు. 47 అంతస్తులుండే జీఏడీ టవర్ నిర్మాణం మొదటి ప్యాకేజీ కింద 1126.51 కోట్లు, రెండో ప్యాకేజీ కింద 1,2 టవర్లకు 1897.86 కోట్లు, మూడో ప్యాకేజీ కింద 1664.45 కోట్లతో 3,4 టవర్ల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. స్ట్రక్చరల్ నిర్మాణం మొత్తం స్టీల్, ఫ్యాబ్రికేషన్ ద్వారానే జరుగుతుంది గనుక.. టవర్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు.