విజయసాయి ఎంటరైతే ప్రజలు అనుమానించరా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేణుంబాక విజయసాయిరెడ్డి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఆయన ఖాళీ చేసిన రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 22 నుంచి 29 వరకు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. మే9న ఎన్నిక జరుగుతుంది. అయితే విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యవహరిస్తున్న సరళిని బట్టి.. ఆయన భారతీయ జనతా పార్టీ లో చేరి.. వారి తరఫున ఈ ఎంపీ స్థానానికి పోటీచేసే అవకాశం ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు. అదే జరిగితే.. ఆయన రాజీనామా వెనుక, ఆయన వైసీపీ వారి మీద చేస్తున్న ఆరోపణల వెనుక కూటమి కుట్ర ఉన్నట్టుగా ప్రజలు అనుమానించే అవకాశం ఉన్నదని కూడా అంటున్నారు.

విజయసాయిరెడ్డి జనవరి 25 న తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆతర్వాత.. తాను జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. ఇక రాజకీయాల్లోకి రాను.. వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించారు. కానీ రాజకీయ సంబంధిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కాకినాడ సీ పోర్టు, సెజ్ వాటాల విక్రయాల వెనుక బెదిరింపులు ఉన్నాయనే కేసులో ఆయన ఇంకా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆ విచారణకు వచ్చినప్పుడు లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డే అని సంచలన ప్రకటన చేశారు. అప్పుడు ఆయన .. అవసరమైనప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటపెడతానని వెల్లడించారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మద్యం స్కాం ను విచారిస్తున్న సిట్ ఆయననుంచి అదనపు వివరాలు సేకరించడానికి సాక్షిగా విచారణకు రావాలని పిలిచింది.

ఇదే సమయంలో ఎంపీ ఎన్నిక నోటిఫికేషన్ రావడం, ఆయన బిజెపి తరఫున ఎంపీగా పోటీచేస్తారనే పుకారు వ్యాప్తిలోకి రావడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బిజెపిలో చేరితే గనుక.. మళ్లీ ఎంపీగా పోటీచేస్తే గనుక.. లిక్కర్ స్కామ్ లో ఆయన చెప్పే సాక్ష్యానికి విలువ ఉంటుందా? ఇదంతా ముందుగానే జరిగిన కుట్రగా ప్రత్యర్థులు ఆరోపించకుండా ఉంటారా? ఒక వ్యూహం ప్రకారం.. ఆయనకు మళ్లీ పదవి ఇస్తాం అని ఎరవేసి.. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రప్పించి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆయనతో సాక్ష్యాలు చెప్పించి.. పదవి ఇచ్చారనే ఆరోపణలు రాకుండా ఉంటాయా? కేవలం పదవుల కోసం ఆశపడి విజయసాయి వెళ్లారని, అందువల్ల ఆయన చెప్పిన సాక్ష్యాలు అన్నీ ఫ్యాబ్రికేటెడ్ అని, అవాస్తవాలు అని.. న్యాయస్థానం ఎదుట కూడా వాదనలు తయారుకాకుండా ఉంటాయా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. విజయసాయికి ఇప్పటికిప్పుడు బిజెపిలో చేరి మళ్లీ ఎంపీ కావాలనే కోరిక ఉంటే ఉండవచ్చు గానీ.. కానీ ఈ దశలో చేర్చుకోవడం కూటమి విశ్వసనీయతకు చేటు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories