లిక్కర్ స్కామ్ దర్యాప్తు ఒక కీలకమైన మలుపు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటిదాకా ఎలాంటి పాత్ర ఉన్నట్టుగా కేసు రికార్డుల్లో లేని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసిన విజయసాయిరెడ్డి కి సిట్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీచేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి.. ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి, రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామాలు చేసేసి ప్రస్తుతం వ్యవసాయం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న విజయసాయిరెడ్డిని విచారణకు పిలవడం అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఒకవైపు ఈ కేసులో కీలక నిందితుడు అయిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయనకోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయి విచారణకు హాజరైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు దిమ్మతిరిగే అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు.
ఈనెల 18న కచ్చితంగా విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు అందజేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 179 ప్రకారం నోటీసులు ఇచ్చారు. ‘ఈ కేసుకు సంబంధించి మీకు నిజాలు తెలుసునని మేం భావిస్తున్నాం. విచారణకు మీరు వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం ఉన్నదని కూడా భావిస్తున్నాం’ అంటూ ఆ నోటీసుల్లో వివరించారు. విజయసాయి రెడ్డి తప్పకుండా విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.
గతంలో ఆయన మరో కేసులో సీఐడీ విచారణకు వచ్చినప్పుడు, బయట మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలు వెల్లడించారు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ.. ఆ విషయంలో అవసరం వచ్చినప్పుడు తనకు తెలిసిన అన్ని వివరాలనూ వెల్లడించడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టంగా చెప్పారు. ఆ సందర్భంలోనే ఆయన మాట్లాడుతూ.. ఈ లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రమే అని ప్రకటించారు. ఆయన అంత స్పష్టంగా చెప్పినందువల్లనే.. ఆయన వద్ద ఈ స్కామ్ కు సంబంధించి మరింత సమాచారం కూడా ఉంటుందనే ఉద్దేశంతో.. లిక్కర్ స్కామ్ ను దర్యాప్తు చేస్తున్న సిట్ పోలీసులు ఆయనకు సాక్షిగా రావాలని నోటీసులు పంపారు.
జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వం ద్వారానే నిర్వహించి.. ధరలను విపరీతంగా పెంచేసి.. ఆ పెంచిన ధరల వ్యత్యాసం మొత్తం లిక్కరు కంపెనీలనుంచి అడ్డదారుల్లో వసూలు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దందాలు చేసినట్టుగా సిట్ నిర్ధారించింది. ఈ వసూళ్ల నెట్ వర్క్ మొత్తాన్ని అప్పటి ప్రభుత్వ ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేపట్టారు. ఆయననుంచి ఎంపీ మిథున్ రెడ్డికి సొమ్ము చేరేదని, అక్కడినుంచి అంతిమ లబ్ధిదారు అయిన ముఖ్యనేతకు అందేవని ఆరోపణలు ఉన్నాయి.
ఎంపీ మిథున్ రెడ్డి పేరు ఇంకా నిందితుల జాబితాలోకి రాలేదు. అదే సమయంలో రాజ్ కసిరెడ్డి నోటీసులకు స్పందించడం లేదు. కేసు విచారణ ముందుకు వెళ్లకుండా ఆగిపోతోంది. గతంలో ఈ కేసు గురించి, దీని వెనుక కీలక పాత్రధారుల గురించి విజయసాయి మాట్లాడి ఉన్నందున.. ఆయనను విచారణకు పిలిచి వీలైనన్ని వివరాలు తెలుసుకోవాలని సిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
విజయసాయి విచారణలో ఏం చెబుతారనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.