తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తే సరిపోతుందని, అడిగేవారు ఎవ్వరూ ఉండరని.. రాజకీయాల్లో ఆరోపణలే తప్ప నిరూపణలు అవసరం లేదని అనుకున్నారో ఏమో గానీ.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మరియు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి.. టీటీడీ గోశాల గురించి అవాకులు చెవాకులు పేలారు. ఆయన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ.. టీటీడీ కౌంటర్లు ఇస్తే.. మళ్లీ రెచ్చిపోయారు. తను చూపించిన ఫోటోలు మార్ఫింగ్ కాదని, అన్నీ నిజాలని ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని సవాళ్లు విసిరారు. రోగి కోరినదే వైద్యుడు ప్రిస్క్రయిబ్ చేశాడన్న సామెత చందంగా.. ఇప్పుడు టీటీడీ భూమన కరుణాకర రెడ్డి మీద చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తిరుపతి ఎస్పీ హర్షవర్దన్ రాజుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి.. తలచినదెల్లా మాట్లాడడం ఇప్పుడు భూమన కరుణాకర రెడ్డికి కుదరకపోవచ్చు. పోలీసులు విచారించేప్పుడు.. తను చూపించిన ఫోటోలు ఎక్కడినుంచి వచ్చాయో, ఎప్పుడు తీసినవో సమస్తం ఆయన చెప్పాల్సి ఉంటుంది. పోలీసు విచారణకు హాజరవుతున్న ప్రతి వైసీపీ నాయకుడూ చెబుతూ వస్తున్నట్టుగా.. తెలియదు.. గుర్తులేదు.. మరచిపోయా.. అని సన్నాయినొక్కులు నొక్కితే కుదరదు అని భూమన కరుణాకర రెడ్డి తెలుసుకోవాలి.
ఎస్వీ గోశాలలో మూడునెలల్లో వంద ఆవులు మరణించాయని, గోశాలను గోవధశాలగా మార్చేశారని కొన్ని చనిపోయిన ఆవుల ఫోటోలు చూపిస్తూ భూమన కరుణాకరరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. వీటిని టీటీడీ ఖండిస్తే.. భూమన మళ్లీ రెచ్చిపోయారు. టీటీడీలో ఏమూల ఏం జరిగినా సరే తనకు సమాచారం ఇచ్చేవాళ్లు రెండువేల మంది ఉద్యోగులు ఉన్నారంటూ డాంబికంగా పలికారు. ఏ విచారణ అయినా చేయించుకోవచ్చునని సవాలు విసిరారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన వ్యవహరించారని, అసత్యప్రచారం చేశారని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ప్రతి అక్రమాన్నీ ఆధారాలతో సహా మాత్రమే తాము బయటపెట్టామని.. కరుణాకర రెడ్డి మాత్రం నోరుందని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన ఛైర్మన్ గా ఉన్న రోజుల్లోనే పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారు. పెద్దసంఖ్యలో గోవులు చనిపోయాయి. గోవిందుడితో , గోవులతో ఆటలాడుకోవద్దని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నాం అని అన్నారు.
కానీ.. భూమన ఏదో యథాలాపంగా బురద చల్లేసి ఊరుకోకుండా.. ఏవిచారణనైనా చేయించండి అంటూ గట్టి సవాళ్లే విసిరారు. ఇప్పుడు పోలీసు విచారణ మొదలు కాబోతోంది. ఆయన హాజరై వాస్తవాలు వెల్లడించాలి. ఫోటోలు ఎక్కడినుంచి వచ్చాయంటే.. దానికి సమాధానం ఆయన వద్ద సిద్ధంగా ఉండాలి. ఆ విషయం పోలీసులకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. అని బుకాయించడానికి.. సమయం వచ్చినప్పుడు బయటపెడతా.. అని మీడియా ప్రెస్ మీట్లలో అన్నట్టుగా బూటకపు మాటలు వల్లించడానికి అవకాశం లేదు. దబాయింపులకు ఆస్కారంలేని విచారణలో భూమన ఎంతో లోతుగా కూరుకుపోతారో వేచిచూడాలి.