రాజ్ కసిరెడ్డి.. పోలీసులు పిలిచిన వెంటనే.. కనీసం రెండు నోటీసులు ఇగ్నోర్ చేసిన తర్వాత.. కోర్టు కూడా ఆయన వినతుల్ని పట్టించుకోకపోయిన తరువాత.. మూడో నోటీసు తర్వాతనైనా పోలీసుల విచారణకు ఏప్రిల్ 9వతేదీన హాజరై ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో. ఇప్పుడు ఏవైతే ఆయన బాగోతాలు బయటకు వస్తున్నాయో.. అవన్నీ బహుశా మరుగున ఉండిపోయేవేమో! రాజ్ కసిరెడ్డి.. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉంటూ.. దాగుడుమూతలు ఆడుతున్న పుణ్యమాని.. ఆయన అరాచకాలు అనేకం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ కేసును దర్యాప్తుచేస్తున్న సిట్.. హైదరాబాదులోని రాజ్ కసిరెడ్డి నివాసాలు, కార్యాలయాలు అన్నింటిమీద సోదాలు నిర్వహించగా అనేక దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. లిక్కర్ స్కాముల్లో దోచుకున్న సొమ్ముల్లో కొంత భాగం రాజ్ కసిరెడ్డి వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు. ఇది గమనించి అధికారులే విస్మయానికి గురవుతున్నారు.
రాజ్ కసిరెడ్డి తన దోపిడీపర్వానికి.. 2.ఓ అన్నట్టుగా ఆ పెట్టుబడుల ప్రస్థానం నడిపించారు. సినిమాలు తీయడానికి ప్రత్యేకంగా ఈడీ క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించారు. అనేక సినిమాల్లో పెట్టుబడులు పంచుకుని భాగస్వామి అయ్యారు. కొన్ని కొత్త ప్రాజెక్టులకు రంగం సిద్ధం చేశారు. రియల్ ఎస్టేట్ విద్యుత్తు రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టారు. కూతురు పేరుతో ఇన్‌ఫ్రా కంపెనీ పెట్టారు. హైదరాబాదులో అనేక కార్పొరేట్ఆస్పత్రుల్లో వాటాలు కూడా కొన్నట్లు వెలుగులోకి వస్తోంది. సోమవారం నిర్వహించిన దాడుల్లో సిట్ అనేక వివరాలు సేకరించింది.
ఏపీలో లిక్కర్ కుంభకోణంలో.. రాజ్ కసిరెడ్డి పోషించినదే ప్రధాన పాత్ర. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించిన నేపథ్యంలో.. మద్యం తయారీదార్లకు ఆర్డర్లు ఇవ్వాలంటే.. ఒక్కో కేసుకు రూ.150 నుంచి 450 వరకు లంచాలు ఇవ్వడం అనేది ఒక రూలుగా మార్చేసి దోచుకున్నారు. డిస్టిలరీలకు చెల్లింపుల తర్వాత.. ఆ దామాషాలో వాటాలను నగదురూపంలో ఇచ్చిన వారికే మళ్లీ ఆర్డర్లు వెళ్లేవి. అలా వ్యవస్థను మొత్తం రాజ్ కసిరెడ్డి నడిపించారు. వసూలైన వాటాలను ఆయన మిథున్ రెడ్డి ద్వారా.. అప్పట్లో ముఖ్యనేతకు చేరవేస్తూ వచ్చారనేది ప్రధాన ఆరోపణ.
అయితే.. ఇంత పెద్ద వేలాది కోట్లరూపాయల దందా నడిపిస్తున్నప్పుడు.. రాజ్ కసిరెడ్డి తనకంటూ దాచుకోవడానికి కొన్ని కటింగులు వేసే అవకాశం ఉంటుంది కదా.. ఆ చిలక్కొట్టుడు కోట్లు అన్నింటినీ ఆయన తన సొంతానికి వాడుకున్నారు. నాలుగేళ్లలో కొత్త లిక్కర్ స్కాం ద్వారా.. మూడువేల కోట్లరూపాయలకు పైగా కొల్లగొట్టారనేది సిట్ తేల్చిన వాస్తవం కాగా.. అందులో రాజ్ కాజేసిన వాటా ఎంత ఉన్నదో తెలియని సంగతి. కానీ.. ఆ డబ్బును చలామణీలోకి తేవడానికి వివిధ రంగాల్లో పెట్టుబడులుగా మార్చారు. ఇప్పుడు ఆయన పరారీలో ఉన్న నేపథ్యంలో ఇళ్లు, ఆఫీసుల మీద సోదాలు జరగడంతో ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కూడా పో లీసులకు దొరికిన తర్వాత ఇంకెన్ని వివరాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.