అర్థం లేని డిమాండ్లతో ఆందోళనలు దండగ!

కాంట్రిబ్యూటరీ పెన్షను స్కీమ్ ను రద్దు చేసే విషయంలో కూటమి ప్రభుత్వం సత్వరమే తుదినిర్ణయం తీసుకోవాలనే డిమాండుతో సీపీఎస్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా జరిగే మంత్రివర్గ సమావేశంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. అయితే సీపీఎస్ ఉద్యోగుల విషయంలో వారి డిమాండ్లకు, ఆందోళనలకు మునుపటిలాగా ఇప్పుడు ఇతర ఉద్యోగుల మద్దతు లభించడం లేదు అన్నది వాస్తవం. మిగిలిన ఉద్యోగ సంఘాల నాయకులు ఏదో మొక్కుబడిగా వారి పోరాటానికి మద్దతు ప్రకటించి ఊరుకుంటున్నారు తప్ప.. మునుపటిలాగా వారికి అండగా నిలవడం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలనే డిమాండ్ లోనే సహేతుకుత లేదని అంతా అనుకుంటున్నారు. అర్థం లేని డిమాండ్లతో ఆందోళన చేయడం వలన ప్రయోజనం ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో వీరి ఆందోళనలకు కాస్త విలువ ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన 2019 ఎన్నికలకు పూర్వం పాదయాత్ర చేస్తున్న సమయంలోనే.. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల లోపే సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ తెస్తానని చాలా డాంబికంగా ప్రకటించారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పర్యవసానాలు ఉంటాయనే విషయంలో కనీస అవగాహన కూడా లేని నాయకుడు కాబట్టి.. ఆయన అలా ప్రకటించారని అనుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికార్లను సంప్రదించిన తర్వాత.. జగన్ కళ్లు తెరచుకున్నాయి. సీపీఎస్ రద్దు మాట ఎత్తడమే మానేశారు. ఆ వర్గం ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. జీపీఎస్ అంటూ రకరకాల అడ్డదారులు తొక్కాలని ఆయన ప్రయత్నించారు. ఉద్యోగవర్గాల్లో భ్రష్టుపట్టిపోయారు.
అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. సీపీఎస్ ఉద్యోగుల ప్రభుత్వాన్ని ఏదైనా ఇతర అభ్యర్థనలు చేయగలరు తప్ప.. సీపీఎస్ రద్దు డిమాండు వినిపించే నైతిక హక్కు కోల్పోయారు. ఎందుకంటే.. చంద్రబాబు గానీ, కూటమి నాయకులు గానీ.. ఏనాడు కూడా సీపీఎస్ రద్దు గురించి కనీసంగా కూడా ప్రస్తావించలేదు.
పైగా, ఇప్పుడు ఆందోళన వ్యక్తంచేస్తున్న ఉద్యోగులు తాము ఇరవయ్యేళ్లుగా అన్యాయానికి గురవుతున్నామని అంటున్నారు. వారు అన్యాయానికి గురైనది కేవలం జగన్ పాలించిన అయిదేళ్ల కాలం మాత్రమేనని మిగిలిన కాలం కాదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే.. వారందరూ ఉద్యోగాలలో జాయిన్ అయ్యేనాటికే.. తమకు సీపీఎస్ మాత్రమే వర్తిస్తుందనే సంగతి వారికి తెలుసు కదా, విషయం తెలిసీ చేరారు.. చేరిన తర్వాత.. దానిని రద్దు చేయాలని ఓపీఎస్  కావాలని పాట మొదలెట్టడం ధర్మం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడున్న వేతనాలు- పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఓపీఎస్ తేవడం సాధ్యం కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. అందుకే అర్థంలేని  డిమాండ్లతో వారి ఆందోళనలను విజయం సాధించవని అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories