జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి రెచ్చిపోయి ప్రవర్తించి.. తన దూకుడుతనాన్ని దౌర్జన్య లక్షణాలను పుష్కలంగా ప్రదర్శించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్లల్ జైలులో రిమాండులో గడుపుతున్నారు. ఆయన ఎంపీ కావడానికెంటె ముందు పోలీసు సర్కిల్ ఇన్స్ పెక్టరు. చట్టం ఏం చెబుతుందో చక్కగా తెలిసిన వ్యక్తి. చట్టాన్ని గౌరవించడం కూడా తెలిసిన వ్యక్తి. అయితే.. అవన్నీ పక్కన పెట్టి.. తానే చట్టం అయినట్టుగా ఏకంగా పోలీసులమీదనే దౌర్జన్యం చేయడం.. పోలీసులు తరలిస్తున్న నిందితుడి మీద ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే దాడికి తెగబడి కొట్టడం అనే దుందుడుకు చర్యలు ఆయనను ఇప్పుడు జైలులో కూర్చోబెట్టాయి. మరి.. తన పార్టీలోని కీలక అనుచరులు.. జైళ్లలో ఉన్నప్పుడు.. వారిని పరామర్శించడానికి వైఎస్ జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు ములాఖత్ కోసం వెళ్లబోతున్నారా? అనేది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా ఉంది.
ఎన్నికలు ముగిసిన తర్వాత.. 11 మంది ఎమ్మెల్యేల నాయకుడుగా మారిన జగన్మోహన్ రెడ్డి.. ప్రజాసమస్యల కోసం తన తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టినది మిర్చి రైతుల ధరల సమస్యల గురించి గళం వినిపించడానికి గుంటూరు మిర్చి యార్డకు వెళ్లడం మాత్రమే. ఆయన రెగ్యులర్ షెడ్యూలు అంటే.. ప్రతివారం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయి.. అక్కడ సరదాగా గడుపుతూ ఉండడం మాత్రమే. ఇవి కాకుండా ఆయన ప్యాలెస్ నుంచి అడుగు బయటపెడుతున్నారంటే దాని అర్థం.. పార్టీ వారు ఎవరైనా చనిపోతే పరామర్శ పేరుతో వారి ఊరికి వెళ్లి, కుటుంబాన్ని పలకరించి, అక్కడ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడానికి, అలాగే, తాము చేసిన పాపాలకు రకరకాల కేసుల్లో ఇరుక్కుని జైలు పాలవుతున్న తమ పార్టీ అనుచర నేతలను ములాఖత్ లలో పరామర్శించడానికి మాత్రమే జరుగుతోంది!
ఆ క్రమంలో ఆయన గతంలో నందిగం సురేష్ ను, వల్లభనేని వంశీని జైళ్లకు వెళ్లి ములాఖత్ లలో పరామర్శించారు. మరి ఇప్పుడు గోరంట్ల మాధవ్ ను కూడా అదేమాదిరిగా పరామర్శించాలి కద అని నాయకులు అనుకుంటున్నారు. పైగా వారిద్దరూ జగన్ కు సంబంధంలేని వేర్వేరు కేసుల్లో అరెస్టు అయ్యారు. నందిగం సురేష్ టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడిచేసిన కేసులో అరెస్టు అయి జైలు పాలయ్యారు. వంశీ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి నిర్బంధించిన కేసులో తొలుత జైలు పాలయ్యారు. పాపం గోరంట్ల మాధవ్ అలాంటి వ్యవహారం కూడా కాదు. అచ్చంగా జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి, ఆయన భార్య వైఎస్ భారతి మీద అసభ్య భాషలో పోస్టులు పెట్టిన వాడిమీద దూకుడుగా దాడిచేసి కొట్టినందుకు, పోలీసుల మీద దౌర్జన్యానికి దిగినందుకు జైలు పాలయ్యారు. మరి ఇలాంటి సందర్భంలో జగనన్న మరింత శ్రద్ధగా గోరంట్ల మాధవ్ ను పరామర్శించడానికి ములాఖత్ కు జైలుకు వెళ్లి ధైర్యం చెప్పాలి కదా అని పార్టీలో నాయకులు అనుకుంటున్నారు.