జగన్ బెయిల్ రద్దు కోసం కోర్టుకు వెళ్లనున్న టీడీపీ!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అనేది కేవలం ఆయనకు ఇటీవల దక్కిన ఒక హోదా మాత్రమే! కానీ ఆయనకు ఇంకా చాలా హోదాలు ఉన్నాయి. దాదాపు పన్నెండేళ్లుగా బెయిలు మీద బయట ఉన్న వ్యక్తి. దాదాపు లక్ష కోట్ల రూపాయల అక్రమాలు, క్విడ్ ప్రోకో అవినీతి, మనీ లాండరింగ్, లంచాలు వంటి కేసులలో ఆయన ఏ1 నిందితుడు. ఆయన మీద సీబీఐ, ఈడీ కేసులు అనేకం ఇంకా నడుస్తున్నాయి. ప్రస్తుతానికి కొన్ని మినహాయింపులు పొంది చెలామణీ అవుతున్నాడు గానీ.. లేదంటే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిన స్థితిలో ఉన్న వ్యక్తి. దేశందాటి బయటకు వెళ్లాలంటే.. విధిగా కోర్టు అనుమతి తీసుకుని గానీ గడప దాటలేని వ్యక్తి. అలాంటి పలు కేసుల నిందితుడు జగన్మోహన్ రెడ్డి పోలీసుల గురించి ఎలా పడితే అలా మాట్లాడడానికి చట్టం ఒప్పుకుంటుందా? పోలీసులనే ఆయన ఎడాపెడా బెదిరించడాన్ని చట్టం సమ్మతిస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశం.

మాజీ ముఖ్యమంత్రి అనే హోదాను అడ్డు పెట్టుకుని.. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా ఉంటూ.. బాధ్యత మరచి.. పోలీసులను తీవ్రంగా బెదిరించడం అనేది బెయిలు నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ‘మీ అంతు చూస్తా, పోలీసులను బట్టలూడదీయించి కొడతా, ఖాకీ బట్టలు తీయించి నిలబెడతా..’ వంటి మాటలు ఖచ్చితంగా నేరం అవుతాయని పలువరు పేర్కొంటున్నారు.
ఒకవైపు ఇవన్నీ బెయిలు నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తాయంటూ.. నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు కూడా. మరోవైపు ఇలాంటి మాటలు బెయిలు నిబంధనల ఉల్లంఘన కింద విచారణార్హం అవుతాయో లేదో న్యాయనిపుణులను సంప్రదించి తెలుసుకునే పనిలో తెలుగుదేశం పార్టీ పడినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇలాంటి దుడుకు మాటలు ఉల్లంఘన కిందికి వచ్చేట్లయితే.. ఆ మేరకు జగన్ ప్రవర్తన తీరు మీద హైకోర్టులో ప్రెవేటు వ్యక్తుల ద్వారా కేసు వేయించాలని తెలుగుదేశం భావిస్తున్నట్టు సమాచారం.

జగన్.. బెయిలు నిబంధనలను ఉల్లంఘించి పోలీసులను బెదిరిస్తున్నారని, వారు స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించే వాతావరణానికి భంగం కలిగిస్తున్నారని.. అందువల్ల ఆయనకు ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం నిజంగానే కోర్టులో పిటిషన్ వేసినట్లయితే.. ఆయనకు చిక్కులు తప్పవని నిపుణులు అంటున్నారు. లావు కృష్ణదేవరాయలు హోం మంత్రికి రాసిన లేఖ కూడా దీనికి సంబంధించిన కసరత్తులో భాగమే అని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ బెయిలు రద్దయితే.. ఆ ఇప్పటికే గందరగోళంగా ఉన్న ఆపార్టీ భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories