లింగమయ్య చావుకంటె జగన్ కు ఎక్కువ దుఃఖం ఎందుకంటే..?

ఇంతకూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీసత్యసాయి జిల్లాలోని పాపిరెడ్డిపల్లికి ఎందుకు వెళ్లారు? అక్కడ మరణించిన తమ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికే కదా? మరి పరామర్శ అంటే ఏమిటి? మీరు ఇంట్లో ఒక మనిషిని కోల్పోయారు.. మీకు వాటిల్లిన నష్టం పూడ్చలేనిది.. మేమంతా అండగా ఉంటాం.. మీ దుఃఖం మా అందరిదీ కూడా అని చెప్పి.. వారికి ఆ రకంగా తాను అండగా ఉంటున్నాననే నమ్మకం కలిగించడమే కదా పరామర్శ! కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును, జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ వారందరినీ పురమాయిస్తున్న తీరును గమనిస్తోంటే.. అలా కనిపించడం లేదు. లింగమయ్య చావుకంటె.. అక్కడ పర్యటనకు వెళ్లిన తనకు భద్రత సరిగా కల్పించలేదనే దుఃఖం జగన్ లో ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.

ఎంతో విలాసవంతమైన తన బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు ఈ పాపిరెడ్డి పల్లినుంచి రోడ్డు మార్గంలో కారులో వెళ్లాల్సి వచ్చినందుకు హెలికాప్టర్ తనను ఎక్కించుకోకుండా వెళ్లిపోయినందుకు.. ఆయన ఎక్కువగా దుఃఖిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో లింగమయ్య చావు అనేది ఇప్పుడు అందరికీ అప్రధాన అంశం అయిపోయింది. ఆయన చావు గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడడం లేదు. అందరూ జగనన్నకు భద్రత కల్పించకపోతే ఎలా? జగనన్న మీద దాడి జరిగితే ఎలా? జగనన్న మీద దాడి చేసే ఉద్దేశంతోనే.. భద్రత ఇవ్వలేదా? అని వాపోతున్నారు.

సాధారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు.. ఏయే ఊళ్లలో ప్రెస్ మీట్లు  పెట్టి.. ఏయే సంగతులు మాట్లాడాలో.. తాడేపల్లి ప్రధాన కార్యాలయం నుంచి స్క్రిప్టులు సిద్ధమై వారికి వెళుతుంటాయనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరికీ అందుతున్న సంకేతాలు ఒక్కటే. ‘జగనన్నకు సరైన భద్రత కల్పించలేదు.. జగనన్న మీద దాడికి ప్లాన్ చేశారు.. జగనన్నని చంపేయాలని అనుకున్నారు..’ అనే ప్రచారాలతో ప్రెస్ మీట్లు పెట్టాలని!

కొందరు నాయకుల్ని తాడేపల్లికి పిలిపించి మరీ అక్కడ స్క్రిప్టు ఇచ్చి ప్రధాన కార్యాలయంలోనే మాట్లాడిస్తున్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఇద్దరూ తాడేపల్లి ఆఫీసులో విడివిడిగా సమావేశం పెడితే.. మరోవైపు బొత్స సత్యనారాయణ విశాఖపట్నం లో ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపటికి ఈ వరసను అందిపుచ్చుకోవడానికి గుంటూరు నుంచి అంబటి రాంబాబు, తిరుపతి నుంచి భూమన కరుణాకర రెడ్డి వంటివారు రెడీగా ఉంటారు. మొత్తానికి జగన్ దళాల్లో లింగమయ్య చావు కంటె.. జగన్ రోడ్డుమీద కారులో బెంగుళూరు ప్యాలెస్ వెళ్లాల్సి వచ్చినందుకు చాలా దుఃఖం పొంగుతున్నట్టుగా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories