వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అనే డిజిగ్నేషన్ కంటె.. నగ్న వీడియో కాల్స్ తో రచ్చకెక్కిన ఎంపీ అంటే ప్రజలకు బాగా గుర్తుండే వ్యక్తి గోరంట్ల మాధవ్! జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లి పర్యటన పూర్తయిన రెండు రోజుల తరువాత.. మాధవ్ ఎన్డీయే కూటమి ప్రభుత్వం మీద కొత్త నిందలు వేయడానికి సిద్ధమై వచ్చారు. తలా తోకా లేని నిందలు వేస్తున్నారు. తను వేస్తున్న నిందల్లో కనీస లాజిక్ కూడా లేదనే సంగతి ఆయన గుర్తించడం లేదు. ఇలాంటి నిందలు వేయడం వలన.. తమ పార్టీ పరువే మరింతగా పోతుందనే సంగతి కూడా గుర్తించడం లేదు.
జగన్ మీద దాడి చేయాలని ప్రభుత్వం పోలీసులు ముందుగా ప్లాన్ చేసి దానికి తగ్గట్టు పోలీసులు భద్రత ఏర్పాట్లను తగ్గించారని మాధవ్ అంటున్నారు. ఇంతకీ ఆయన ఆవేదన ఏమిటో తెలుసా? లింగమయ్య ఇంటి వద్ద పోలీసులు మెటల్ డిటెక్టర్ ఏర్పాటుచేయలేదట. అది వారి తప్పు అట. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతినెలా పింఛన్ల పంపిణీ సందర్భంగా కొన్ని ఇళ్లు తిరుగుతూ ఉన్నారు. ఆయా పేదల కుటుంబాలతో చాలా సన్నిహితంగా మెలగుతున్నారు. ఆయనకే మెటల్ డిటెక్టర్ లు పెట్టడం లేదు. మరి మాజీ ముఖ్యమంత్రికి పెడతారా అనేది జనం సందేహం. గతంలో వారి ఏలుబడి సాగినప్పుడు.. చంద్రబాబు పర్యటించిన ప్రతిచోటా ఇలాగే మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుచేశారా? అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
హెలిప్యాడ్ వద్ద గార్డు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదట. ఇది కూడా మాధవ్ చేస్తున్న ఒక ఆరోపణ. మొత్తం 1100 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. అంతకంటె ఏం చేయాలి. అసలు హెలిప్యాడ్ వద్దకు కార్యకర్తలు ఎవ్వరూ రావొద్దని పోలీసులు పదేపదే జాగ్రత్తలు చెప్పినా కూడా.. కావాలని అక్కడకు జనాన్ని డబ్బులిచ్చి తోలిన నాయకులు కదా.. జగన్ మీద కుట్ర చేసినట్టు భావించాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పథకం ప్రకారం హెలికాప్టర్ ను ధ్వంసం చేయాలని అనుకున్నారట. ఆ రకంగా జగన్ ను రోడ్డు మార్గంలో వెళ్లేలా చేసి.. అప్పుడు దాడి చేయాలని అనుకున్నారట. ఇదంతా చూస్తే అలాంటి ఆలోచన గోరంట్ల మాధవ్ కు తప్ప మరెవ్వరికీ రాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ఇదంతా ప్రభుత్వం స్కెచ్ అయితే గనుక.. మరి వారు అనుకున్నట్టుగానే ఆయన రోడ్డు మార్గంలో వెళ్లారు కదా.. దారికాచి ఎక్కడో ఒకచోట దాడిచేసి ఉండాలి కదా? అనేది ప్రజల సందేహం. జనంలోంచి గులకరాయి వచ్చి తగిలితే హత్యాయత్నం అని చెప్పుకుని ప్రజల జాలి పొందాలని లేకి వేషాలు వేసిన నాయకుడిమీద దాడి జరగకపోయే సరికి మాధవ్ లాంటి వాళ్లు బాధపడుతున్నట్టుంది. దాడి జరిగి ఉంటే పార్టీకి అంతో ఇంతో మైలేజీ వచ్చి ఉండేది కదా.. తమ కార్యకర్తలే ధ్వంసం చేసిన హెలికాప్టర్ వ్యవహారాన్ని ప్రభుత్వం మీదికి ఎలా నెట్టాలా ? అని వారంతా మధనపడుతున్నట్టుంది.