పోలీసులు ఏదైనా ఒక నిబంధన పెట్టి, ఆంక్షలు విధించారంటే.. అది అవతలి వాళ్ల మీద కక్షతోనో, దురుద్దేశంతోనే చేశారని అనుకోవడం మంచి పద్ధతి కాదు. అలాగే పోలీసులు ఆంక్షలు విధించినప్పుడు.. ఆ ఆంక్షలను అతిక్రమించడం.. వారిని రెచ్చగొట్టేలా ప్రవర్తించడం అనేది హీరోయిజం అనుకుంటే కూడా కుదర్దు. అలాంటి అతి చేసిన ఫలితం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికే బెడిసికొట్టింది. హెలిప్యాడ్ వద్ద భారీ సంఖ్యలో గుమికూడిన జనం.. ఆగిన హెలికాప్టరు వద్దకు దూసుకెళ్లడం, దాని మీద పడడంతో హెలికాప్టర్ కొంచెం దెబ్బతింది. తాడేపల్లి నుంచి రాప్తాడు వరకు హెలికాప్టర్ లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాప్తాడు నుంచి బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు కూడా అందులోనే వెళ్లాలన్నది తొలుత ప్రకటించిన షెడ్యూలు.
అయితే అది కాస్తా కార్యకర్తల దూకుడుతో దెబ్బతినడంతో.. ఆయన వేరే గతిలేక.. రోడ్డు మార్గంలో కారెక్కి బెంగుళూరుకు వెళ్లారు.
జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లె లో మంగళవారం పర్యటించారు. మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన పర్యటన ఫిక్సయిన తర్వాత పోలీసులను అనుమతుల కోసం సంప్రదించారు. అయితే ఆయన అడిగినట్టుగా చెన్నేకొత్తపల్లి వద్ద కాకుండా, పాపిరెడ్డి పల్లెకు రెండు కిమీల దూరంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అడిగిన చోట హెలిప్యాడ్ ఇవ్వనందుకే జగన్ దళాలు పోలీసుల మీద అనేక విమర్శలు చేశాయి. జగన్ పర్యటనకు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో రాకుండా పోలీసులు బెదిరిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. వార్తలు కూడా వేశారు.
అయితే పోలీసులు మాత్రం.. తమ పని తాము చేసుకుపోయారు. శాంతి భద్రతల వ్యవహారం మాత్రమే గమనించే పోలీసులు.. హెలిప్యాడ్ వద్దకు ప్రజలు ఎవ్వరూ రావొద్దని ముందే ఆంక్షలు కూడా విధించారు. ఈ మేరకు పార్టీకి కూడా సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు చెప్పినట్టుగా చేస్తే వారు వైఎస్సార్ కాంగ్రెస్ ఎందుకు అవుతారు? పోలీసులను రెచ్చగొట్టడమే లక్ష్యం అన్నట్టుగా.. జనాన్ని సమీకరించిన వైసీపీనేతలు అందరినీ హెలిప్యాడ్ వద్దకే తరలించారు.
అయితే అక్కడ జనాన్ని నియంత్రించడంలో ఏమాత్రం గట్టిగా వ్యవహరించినా.. వైసీపీ నాయకులు నానా రాద్ధాంతం చేస్తారని, ఏం జరిగినా సరే పోలీసులను విమర్శించడం అలవాటుగా మార్చుకుంటారని కాస్త ఆగారు. దానికి తోడు కార్యకర్తలు మరికొంత అతి చేశారు. హెలికాప్టర్ వచ్చిన తరువాత.. ఏకంగా దాని మీదకు దూసుకుపోయారు. ఫలితం- హెలికాప్టర్ దెబ్బతింది. ఆ హెలికాప్టర్ లో బెంగుళూరు వెళ్లడం సేఫ్ కాదని, ఆ వర్గాలు జగన్ కు తెలియజెప్పాయి. దాంతో ఆయన వేరే గతిలేక.. కారులో బెంగుళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. తన పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసిన అతి.. ఆయనకే ఇబ్బందిగా మారినట్టు అయింది.