బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డులు మాత్రమే కాదు.. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితంలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ‘భాషా’ ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ సినిమా కథ గుర్తుందా? హీరోకు ముంబాయిలో ఒక బీభత్సమైన నేరచరిత్ర ఉంటుంది. పరిస్థితుల ప్రభావం వల్ల అక్కడినుంచి కుటుంబం సహా వచ్చేసి మరొక ప్రాంతంలో తన గతం ఎవ్వరికీ తెలియకుండా బతుకుతూ ఉంటాడు. ఈ మూల కథాంశం మీద తతిమ్మా కథ నిర్మాణం అవుతుంది. ఇదే సబ్జెక్టుతో తర్వాత మనకు అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కడపజిల్లాలోని మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్టు వ్యవహారాన్ని గమనించిన వారికి ఇప్పుడు ‘బాషా’ సినిమానే గుర్తుకు వస్తోంది. కాకపోతే ఒక్కటే తేడా.. సినిమాల్లో హీరోలు పాజిటివ్ షేడ్ అయితే.. కడపజిల్లా బిడ్డ అహ్మద్ బాషా యవ్వారాలన్నీ నెగటివ్ షేడ్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానాలో.. జగన్ అండ చూసుకుని చెలరేగిపోయిన వారిలో అహ్మద్ బాషా కూడా ఒకరు. ఆయన అన్న కడప ఎమ్మెల్యే. అండదండలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండనే ఉన్నారు. ఇక కడపలో ఆయన అరాచకాలకు అంతే లేకుండాపోయింది. అనధికారిక వెంచర్లను అంటగట్టడం, భూకబ్జాలుచేసి వెంచర్లు వేయడం, బెదిరింపులు, దాడులు ఇవన్నీ ఆయనకు నిత్యకృత్యం అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇక ప్రస్తుతానికి తన పప్పులు సాగవని అనుకున్నారో ఏమో.. ఎంచక్కా దుబాయి వెళ్లిపోయారు.
ఇక్కడ కడపలో అహ్మద్ బాషా మీద అనేక కేసులు ఉన్నాయి. గతంలో ఆయనకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. విచారణకు 15రోజుల తర్వాత వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఇప్పటిదాకా ఇటురానేలేదు. దుబాయిలోనే ఉంటున్నాడు. రంజాన్ సందర్భంగా కడపకు వచ్చాడు. అయినా సరే.. తన రాక సంగతి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తిరిగి విదేశాలకు వెళ్లిపోతూ ముంబాయి ఎయిర్ పోర్టులో కువైట్ ఫ్లైటు ఎక్కే ప్రయత్నంలో ఉండగా విమానాశ్ర య పోలీసులు పట్టుకున్నారు.
ఇదంతా సినిమా ఫక్కీలో ఆశ్చర్యం కలిగించే వ్యవహారం. అహ్మద్ బాషా మీద పోలీసులు గతంలో లుక్ అవుట్ నోటీసులు జారీచేసి ఉండబట్టి.. ఇప్పటికైనా ఆయనను అరెస్టు చేయడం అనేది సాధ్యమైంది.
అహ్మద్ బాషా ఇన్నాళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న వైనం గమనిస్తే.. బయటి ప్రాంతాలకు, వీలైతే బయటి దేశాలకు కూడా వెళ్లిపోయి ఇలా అజ్ఞాతంలో బతుకుతున్న బాషాలు వైసీపీలో ఇంకా ఎందరున్నారో అనే సందేహం కలుగుతుంది. గతంలో దేవినేని అవినాష్ వివిధ కేసుల్లో నిందితుడు దేవినేని అవినాష్ హైదరాబాదు నుంచి దుబాయి వెళ్లే ప్రయత్నంలో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే సజ్జల కూడా విదేశాలకు వెళ్లి, తిరిగి రావడం ముంబాయి విమానాశ్రయంలో దిగగానే లుక్ అవుట్ నోటీసుల ఫలితంగా పట్టుకున్నారు. ఈ రకంగా అజ్ఞాతంలోకి వెళ్లి తలదాచుకుంటున్న వారిని కనిపెట్టడానికి పోలీసులు ప్రత్యేకమైన డ్రైవ్ చేయాల్సి వచ్చేలా ఉన్నదని ప్రజలు అంటున్నారు.