ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను ఆశిస్తూ.. కూటమి పార్టీల అనుబంధాన్ని కలకాలం కాపాడడానికి ప్రభుత్వ సారథి చంద్రబాబునాయుడు చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే కూటమిలోని కొందరు నాయకులు మాత్రం.. ముందు చూపు లేకుండా వ్యవహరించడం ద్వారా.. కూటమి మైత్రి అనేది అల్లరిపాలయ్యేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ఈ కోణంలో చూసినప్పుడు ప్రధానంగా ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు పేరే వినిపిస్తోంది. ఆయన ఇతరత్రా సందర్భాల్లో ఎలా ఉంటున్నప్పటికీ.. ప్రత్యేకించి పిఠాపురం నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీని అవమానించే తీరులోనే ప్రవర్తిస్తున్నారు. మాట్లాడుతున్నారు. అలా కాకుండా.. ఆయన కాస్త సంయమనం పాటించాలని అన్ని పార్టీల నాయకులు కోరుకుంటున్నారు.
పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని పిఠాపురంలో నిర్వహించినప్పుడు.. నాగబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు. పేరు ప్రస్తావించలేదు గానీ.. డైరక్టుగా వర్మను ఉద్దేశించి.. ఇక్కడ పవన్ గెలవడానికి తామే కారణం అని ఎవరైనా అనుకుంటే గనుక.. అది వారి ఖర్మ అంటూ నాగబాబు ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు వర్మ ఇంటికి వెళ్లి మరీ పవన్ కల్యాణ్ బతిమాలుకున్న వైనం ఆయన మరచిపోయినట్లుంది. అప్పుడేదో భారీ బహిరంగసభలో జనాన్ని చూసిన ఆవేశంలో మాట్లాడారని సరిపెట్టుకోవడానికి వీల్లేదు.
ఎమ్మెల్సీ అయిన తర్వాత.. తొలిసారిగా అధికారిక హోదాలో.. పిఠాపురంలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నాగబాబు తెలుగుదేశం వారిని పూర్తిగా పక్కన పెట్టారు. అలాగని కేవలం అధికారులతో కలిసి తిరగలేదు. అధికారిక వేదికలమీద జనసేన నాయకులను కూడా కూర్చోబెట్టుకున్నారు. కూటమి ధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. వర్మకు కనీసం సమాచారం కూడా పంపలేదు. పైపెచ్చు.. వర్మకు అనుకూలంగా నినాదాలు చేసిన వారిమీద పోలీసు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా ఉంది.
ఒకవైపు కూటమి బంధాన్ని కాపాడడం కోసం చంద్రబాబునాయుడు ఎంతో సంయమనం పాటిస్తున్నారు.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనసేన సొంత బలంతోనే ఈ ఎన్నికల్లో గెలిచిందని నాగబాబు లాంటి వారు విర్రవీగుతున్నట్టే.. తెలుగుదేశంలో కూడా జనసేన లేకపోయినా ఈ దఫా తాము బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లం అని నూటికి నూరుశాతం కార్యకర్తలు నమ్ముతున్నారు. కానీ, ఇక్కడ ఎవరి బలం ఎంత అనేది ముఖ్యం కాదు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారా లేదా అనేది ముఖ్యం. ఈ బంధం తెగితే ఫలితాలు దారుణంగా ఉంటాయనేది నాగబాబు రాజకీయ పరిజ్ఞానానికి అందకపోవచ్చు. కానీ.. భవిష్యత్తు కూడా బాగుండాలంటే.. ఆయన సంయమనం పాటించడం చాలా ముఖ్యం అని తెలుసుకోవాలి.