‘కాలం అన్ని గాయాలను మాన్పేస్తుంది’ అని పెద్దలు అంటూ ఉంటారు. కానీ కాలం మాన్పలేని గాయాలు కూడా కొన్ని ఉంటాయి. దశాబ్దాలు గడచిపోయినా సరే.. ఆ గాయాలు పచ్చిపుండ్ల మాదిరిగా సలుపుతూనే ఉంటాయి. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆమె భర్త, స్థానికంగా విస్తృత ప్రజాదరణను సొంతం చేసుకున్న నాయకుడు పరిటాల రవి ఒకప్పట్లో ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆగాయాన్ని పరిటాల సునీత ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.
అలాగే.. కాలం గాయాల్ని మాన్పుతుందో లేదో గానీ.. కాలం గడచిపోయినంత మాత్రాన పాపాలు మాసిపోవు. వాటిని మరచిపోవడం కూడా సాధ్యం కాదు. ఆ విషయాన్ని కూడా సునీత నిరూపిస్తున్నారు. తన భర్త హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నదని.. పరిటాల సునీత ఇప్పటికీ ఆరోపిస్తున్నారు. అప్పట్లో సీబీఐ కూడా ఈ కేసు విషయంలో జగన్ ను విచారించిందని సునీత గుర్తు చేస్తున్నారు.
రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాల చరిత్రను గుర్తుచేసుకోవడం జరుగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరులు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఈ ప్రాంతంలో ఉండే వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా అదే అంటున్నారు. తోపుదుర్తి సోదరులు శవరాజకీయాలు చేస్తున్నారని సునీనత ఆరోపిస్తున్నారు. జిల్లాలో జరిగిన హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించడానికి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్ని.. రాద్దాంతం చేయడానికి జిల్లా పర్యటనకు రావడానికి జగన్ సిద్ధం కావడాన్ని ఆమె తప్పు పడుతున్నారు.
ప్రకాశ్ రెడ్డి సోదరులు టీవీబాంబు గురించి మాట్లాడుతున్నారని, కారు బాంబు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆమె గుర్తుచేస్తున్నారు. కారుబాంబు, టీవీబాంబులతో 45 మందినిపొట్టన పెట్టుకున్న చరిత్ర వారికి ఉందని సునీత అంటున్నారు. అప్పట్లో శ్రీరాములయ్య షూటింగ్ ప్రారంభం సందర్భంగా పరిటాల రవిని హత్య చేయడానికి కారు బాంబుతో ప్రత్యర్థులు చేసిన దాడిలో పలువురు మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి అమాయకుల ప్రాణాలను బలిగొన్నందుకు, రవి హత్య వెనుక తన హస్తం కూడా కలిగిఉన్న జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పి ఆ తర్వాతే జిల్లాలోకి అడుగుపెట్టాలని సునీత డిమాండ్ చేస్తున్నారు.
రవి హత్యకు గురైనప్పుడే.. ఆ హత్యను ఆయన రాజకీయ ప్రత్యర్థులే చేయించినట్టుగా ప్రచారం జరిగింది గానీ.. వారి వెనుక అండదండలుగా జగన్ కూడా కీలక పాత్ర పోషించినట్టు ప్రచారం జరిగింది. ఫ్యాక్షన్ హత్యల పేరుతో ఇప్పుడు రాద్ధాంతం జరుగుతున్న సమయంలో.. జగన్ అసలు గత చరిత్రను సునీత వెలికి తీసి, ఆయనను నిలదీస్తున్నారని ప్రజలు అంటున్నారు.